- మోడీకి ఉత్తరాల వర్షం.. పకోడీ వ్యాపారానికి లోన్ ఇప్పించండి
ప్రధాని మోడీ సలహాను పాటించేందుకు రెడీ అవుతున్నారు నిరుద్యోగులు. ఆయన ఇచ్చిన సూచన తెగ నచ్చినట్లుంది. అందుకే నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా.. వ్యాపారం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అదే పకోడి బిజినెస్. పెట్టుబడికి డబ్బుల్లేక పోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం కనిపించకపోవడంతో అప్పు ఇప్పించాలంటూ ఏకంగా నేతలకే ఉత్తరాలు రాస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అమేథికి చెందిన అశ్విన్ మిశ్రా అనే యువకుడు.. పకోడి వ్యాపారం కోసం లోన్ (అప్పు) ఇప్పించాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు స్థానిక నేత మోసిన్ రాజాకు పంపించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రుణం ఇప్పిస్తే పకోడీ బిజెనెస్ చేసుకుంటానని లేఖలో తెలిపాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అలసిపోయానన్న అశ్విన్.. ఈ మధ్యే ప్రధాని ఇంటర్వ్యూ చూశానని.. అందులో నిరుద్యోగులకు ఇచ్చిన సలహా.. తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. పకోడి వ్యాపారంతో తన కుటుంబాన్ని పోషించడమే కాక.. మరో ఇద్దరు, ముగ్గురికి ఉపాధి కల్పించవచ్చన్నాడు. బిజినెస్ మొదలు పెట్టేంత ఆర్థిక స్థోమత తనకు లేదన్నాడు. ప్రధాని ఇచ్చిన పకోడీ సలహా తప్పుకాదని.. సలహా ఇచ్చినట్లే లోన్ ఇవ్వాలని బ్యాంకుల్ని సూచించాలని కోరాడు అశ్విన్. ఈ యువకుడి బాటలోనే మరికొందరు నిరుద్యోగులు.. బీజేపీ నేతలపై ఉత్తరాల యుద్ధం ప్రకటించారు. పకోడీ వ్యాపారం చేసుకునేందుకు బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించాలంటూ లేఖలు రాస్తున్నారు