ఎర్ర చందనం తరలించడానికి స్మగ్లర్లు రకరకాల దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా పెళ్లి అలంకరణఅతో వున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలించేందుకు సిద్ధమైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. రేణిగుంట్ల సమీపంలోని తిరుమల నగర్ వద్ద సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెళ్లి కారు కనిపించింది. ఈ కారుపై పద్మ వెడ్స్ వాసు అని పోస్టర్ కూడా అంటించారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. పెళ్లి పేరుతో అందంగా అలంకరించిన కారులో స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్లుగా గుర్తించారు.