YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

సినిమాకు స్వస్తి పలకనున్న ‘లోకనాయకుడు’..?

సినిమాకు స్వస్తి పలకనున్న ‘లోకనాయకుడు’..?

-  ఆ తర్వాత నా సినిమాలు రావు

- రాజకీయ  పార్టీ స్థాపించే దిశగా కమల్ 

తన నటనతో యావత్‌ భారతీయ సినీ ప్రేక్షక లోకాన్నీ ఆకట్టుకుని ‘లోకనాయకుడు’ అన్న బిరుదుకు సార్థకత తెచ్చిన నటుడు కమల్‌హాసన్‌. ఆయన చేసినన్ని పాత్రలు, ప్రయోగాలు మరో కథానాయకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు పాత్రకోసం ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో స్వీకరించే నటుడాయన. మరి అలాంటి నటుడు ఇక వెండితెరపై కనిపించడా? ఆయన నటనను ఇక చూడలేమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలో పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ఇప్పటికే కమల్‌హాసన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాలకూ స్వస్తి పలకనున్నారట. మంగళవారం ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

‘‘ఇక నా నుంచి రెండు సినిమాలు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత నా సినిమాలు రావు. నిజాయతీతో జీవిస్తూ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. కానీ, ఓడిపోతానన్న ఆలోచనే లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధంలేదు. కానీ, 37 సంవత్సరాలుగా నేను సామాజిక సేవలో ఉన్నా. ఈ 37ఏళ్ల కాలంలో విధేయత కలిగిన 10లక్షల మంది కార్యకర్తలను సంపాదించుకోగలిగాను. అప్పటి నుంచి వాళ్లందరూ నాతో ఉంటున్నారు. మరింత మందికి సేవ చేయడానికి నా సూచనలతో యువరక్తాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఇందులో 250మంది లాయర్లు కూడా ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.’’

‘‘నా కెరీర్‌లో నేను డబ్బు బాగానే సంపాదించా. నా బ్యాంకు బ్యాలెన్స్‌ను పెంచుకోవడానికి రాజకీయాల్లోకి రావడం లేదు. సంతోషమైన, ప్రఖ్యాతినొందిన జీవితాన్ని గడిపా. కేవలం ఒక నటుడిగా మాత్రమే చనిపోకూడదని నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోలేదు. ప్రజా సేవలో మరణిస్తా. అలా నాకు నేను వాగ్దానం చేసుకున్నా. నా రాజకీయ రంగు కాషాయం కాదు.. నలుపు. అది ద్రావిడుల శరీర రంగును ప్రతిబింబిస్తుంది. సంస్కృతి పరంగా తమిళులకు అది చెడ్డ రంగేమీ కాదు. భాజపాతో చేతులు కలిపే ఆలోచన ప్రస్తుతానికి లేదు’’

‘‘సిద్ధాంతపరంగా భారత్‌ ఇలా ఉండాలని నమ్ముతా. అయితే అది కొత్తదేమీ కాదు. అందుకు సాధన చేస్తూ ఉంటాం. మార్పునకు నేను వ్యతిరేకిని కాదు కానీ, మూర్ఖత్వపు, నియంతృత్వపు మార్పును మాత్రం ఒప్పుకోను. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఇద్దరికీ నేను అభిమానినే. దేశంలో ఉండే భిన్నత్వంలోని ఏకత్వం భారత్‌ను ప్రపంచంలోనే వినూత్న దేశంగా  తయారు చేసింది. అతివాదం అనేది దేశంలో పెద్ద స్థాయిలో లేదు. అయితే మీరు చేసే మార్గ నిర్దేశం ప్రకారం వెళుతుంది అయితే దీన్ని మనం నిలువరించాలి. మన పేరు ప్రఖ్యాతులను నిలుపుకోవాలి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి.’’

‘‘హిందువులంటే నాకేమీ వ్యతిరేకత లేదు. వారికి విరోధిని కాదు. మా కుటుంబంలోనూ చాలా మంది ఉన్నారు. నేను కేవలం ఇలాంటి అతివాదమే మంచిది కాదని చెబుతా. అది మనకు ఎంతో చెడుచేస్తుంది.’’

రజనీకాంత్‌తో చేతులు కలుపుతారా!

‘‘నేను ఫిబ్రవరి 21న నా పార్టీని ప్రకటించి, ఆ తర్వాత మార్గ నిర్దేశకాలను వెల్లడిస్తా. ఆయన(రజనీ) కూడా అదే చేస్తారు. అప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలా? వద్దా? అనేది ఆలోచిస్తా.కాషాయ కూటమితో రజనీ జట్టు కడితే ఎలాంటి పొత్తు ఉండదు.’’

తాజాగా కమల్‌ అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ రజనీ రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావించారు. ‘రజనీ రాజకీయ రంగు కాషాయం(భాజపా) కాదని భావిస్తున్నా. అదే జరిగితే ఆయనతో కలిసి పనిచేయడం జరగదు. మేమిద్దరం మంచి స్నేహితులమే కానీ, రాజకీయాలు వేరు. ప్రస్తుతానికి దీనిపై స్పష్టత లేదు.’ అని అన్నారు. అవసరమైతే ఇతరులతో కలిసి పనిచేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. ఒకవేళ తన పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి, ప్రతిపక్షంలో కూర్చుంటానని అన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే తన సమయం వచ్చే వరకూ వేచి చూస్తానని తెలిపారు. ప్రజలతో కలిసి నడిచేందుకే తాను కొత్తగా పార్టీని ప్రారంభిస్తున్నానని, అంతేతప్ప రాజకీయ నాయకులతో కలిసి పనిచేసేందుకు కాదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కగా లేవని తాజా తమిళ రాజకీయాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Related Posts