ఏపీ ప్రభుత్వ విప్, దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మరోసారి వార్తల్లో నిలిచారు. మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా కాజా దగ్గర చింతమనేని కారును టోల్‌గేట్ సిబ్బంది ఆపడంతో వివాదం రేగింది. తాను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేను అని చెప్పినా సిబ్బంది వినలేదు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభాకర్.. కారును అక్కడే వదిలేసి బస్సెక్కి వెళ్లిపోయారు. ఇలా వినూత్నంగా తన నిరసనను తెలియజేశారు. చింతమనేని కారును ఆపడంపై వివాదం చెలరేగడంతో టోల్‌గేట్ సిబ్బంది వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే కారుపై నెంబర్ లేదని, ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదన్నారు. చింతమనేని తలకు క్యాప్ ఉండటంతో గుర్తు పట్టలేకపోయామని.. గన్‌మెన్‌లను చూసిన తర్వాత కారును వెళ్లమని చెప్పామంటున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఆగ్రహంతో కారు అక్కడే వదలి వెళ్లిపోయారన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు.