దేశ రాజధాని పౌరులకు త్వరలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రకటించిన ఉచిత వైఫై సేవల హామీ యువతను ఆకర్షించింది. ఢిల్లీలో ఆప్ పాలనాపగ్గాలు చేపట్టి బుధవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. త్వరలోనే తాము ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యే తేదీని వెల్లడిస్తామని..దీనికోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా’మని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఉచిత వైఫై అమలుపై ఆప్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విపక్షాలు తరచూ విమర్శల దాడికి దిగుతున్న క్రమంలో కేజ్రీవాల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఆప్ ప్రభుత్వం 2016, డిసెంబర్ నాటికి తూర్పు ఢిల్లీలోని 500 ప్రదేశాల్లో వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. మరోవైపు మహిళల భద్రత కోసం ఢిల్లీ అంతటా సీసీటీవీ కెమెరాలను అమర్చే ప్రక్రియ ప్రారంభమైందని కేజ్రీవాల్ వెల్లడించారు.