సమకాలీన మహిళా నేతల్లో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తర్వాత స్థానం సుష్మాస్వరాజ్ దే. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ప్రస్థానం ప్రారంభించిన ఆమె నేడు అత్యున్నతమైన, కీలకమైన విదేశాంగశాఖకు సారథిగా ఉన్నారు. ఇందిరాగాంధీ అనంతరం విదేశాంగ శాఖ నిర్వహించిన రెండో మహిళా నేతగా సుష్మ చరిత్ర సృష్టించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె చేపట్టని పదవి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘన చరిత్ర ఆమె సొంతం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా, కేంద్రమంత్రిగా ఇలా ఏ పదవి చేపట్టినా మెరుగైన పనితీరుతో పదవులకే వన్నె తెచ్చారు ఆవిడ. ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఎందరో అభాగ్యులకు, నిరుపేదలకు నేనున్నానంటూ అండగా నిలిచారు. అలాంటి నేత రాజకీయాల నుంచి రిటైరవుతానని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. తన అభిమానులను నిరాశపరిచారు ఈ “విదీష” లోక్ సభ సభ్యురాలు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ వివిధ వర్గాల నుంచి డిమాండ్లు విన్పిస్తున్నాయి. సుష్మ ఉన్నత విద్యావంతురాలు. ప్రముఖ న్యాయవాది. మంచి వక్త. భిన్న భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల దిట్ట. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి క్రియాశీల రాజకీయాల్లో కొంతకాలం కొనసాగడం అవసరం.పుప్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిన్న తనంలోనే సుష్మ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశారు. 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో జన్మించిన సుష‌్మ పూర్వీకులది పాకిస్థాన్ లోని లాహోర్ నగరం. చంఢీఘడ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. అప్పట్లో వరుసగా మూడేళ్లపాటు ఉత్తమ హిందీవక్తగా అవార్డు పొందారు. 1973లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఆమె భర్త స్వరాజ్ కౌశల్ కూడా ప్రముఖ న్యాయవాది. మాజీ కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండజ్ న్యాయవాద బృందంలో సుష్మ పనిచేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో జైలుకెళ్లారు. పాతికేళ్ల వయసులోనే 1977లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. హర్యానా ముఖ్యమంత్రి దేవీలాల్ మంత్రివర్గంలో చేరారు. అంబాలా కంటోన్మెంట్ కు ఎన్నికైన అతి చిన్న వయస్కురాలు ఆమే. దేవీలాల్ మంత్రివర్గంలో చిన్న వయసు కలిగిన వ్యక్తి కూడా ఆమే కావడం విశేషం. 1979లో హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 1987-90ల మధ్య కాలంలో రాష్ట్రంలోని జనతా పార్టీ లోక్ దళ్ మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో కేంద్రంలో వాజ్ పేయి మంత్రివర్గంలో పనిచేశారు. అదే ఏడాది అక్టోబరు లో ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తొలి మహిళానేత సుష్మా స్వరాజ్ కావడం విశేషం. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని విదీష నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 నుంచి 2014 వరకూ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.వాస్తవానిక ఏ సభలో అయినా ప్రతిపక్ష నేత జాతీయ స్థాయిలో అయితే ప్రధాని, రాష్ట్ర స్థాయిలో అయితే సీఎం పదవికి పోటీ పడతారు. ఈ కోణంలో చూస్తే 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా సుష్మా పేరు తెరపైకి రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా మోదీ పేరు వెలుగులోకి రావడంతో సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితానికి గ్రహణం పట్టింది. గెలిచిన తర్వాత ఆమెను విదేశాంగ శాఖకే పరిమితం చేశారు. విదేశాంగ మంత్రిగా ప్రధాని విదేశీ పర్యటనల్లో పాల్గొనడం సహజం. కానీ ఈ నాలుగున్నరేళ్లలో మోదీ అనేక దేశాల్లో పర్యటించినప్పటికీ సుష్మాను పక్కన పెట్టారు. అంతర్గత రాజకీయాలే ఇందుకు కారణమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. విదేశాంగ మంత్రిగా ఆమె ఎంతో మందిని ఆపద సమయంలో ఆదుకున్నారు. ప్రజల విన్నపాలకు తక్షణమే స్పందించేవారు. ఎయిర్ పోర్టులో తప్పిపోయిన తన సోదరుడిని కాపాడమన్న ఓ సోదరి అభ్యర్థనకు తక్షణమే స్పందించారు. వివిధ కారణాల వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల ఇబ్బందులను వినగానే తక్షణమే సమస్యను పరిష్కరించేవారు. ఇలా ఆమెపేరు జాతీయ స్థాయిలో సుష్మ పేరు మార్మోగింది. 1998లో కర్ణాటక బళ్లారిలో సోనియాగాంధీపై పోటీ చేసిన ధీమంతురాలు. నుదుట బొట్టు, సంప్రదాయ వస్త్రధారణతో నూటికి నూరుశాతం భారతీయతను ప్రతిబింబించే సుష్మాస్వరాజ్ అనారోగ్య కారణాల రీత్యా 2019 ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. మోదీ వ్యతిరేక గ్రూపులో ఉండటం,అద్వానీ శిష్యురాలిగా గుర్తింపు కారణంగా బీజేపీ కొత్త నాయకత్వం ఆమెను పక్కన పెట్టినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెబుతున్నారు. కానీ సుష్మా లాంటి నిబద్దత గల నేతలు మరికొంత కాలం పార్టీకి, జాతికి అవసరం….!!