ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల కోసం సిద్ధమయ్యే తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని అంతా భావించారు. అయితే, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది. పవన్.. టీడీపీతో విభేదించిన తర్వాత వైసీపీ కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాడు. ప్రతిపక్ష నేత పాత్రను కూడా తనే పోషిస్తున్నాడు. ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటిస్తూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే పలువురు నేతలను జనసేనలోకి ఆహ్వానించాడు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలోని కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీ కండువా కప్పుకోగా, మరికొందరు వారి బాటలో ఉన్నారు. ప్రస్తుతం జనసేనాని అమెరికా పర్యటనలో ఉన్నాడు. అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నారైలో కార్యక్రమాలు నిర్వహించి, ప్రసంగాలు ఇస్తున్నాడు.డల్లాస్ టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ వేదికగా రెండు రోజుల క్రితం జరిగిన జనసేన ప్రవాసగర్జన సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వైరల్ అయింది. ఈ ప్రసంగంలో తాను అమెరికా నడిబొడ్డున భారత ఔన్నత్యాన్ని చాటేందుకు వచ్చాను తప్ప విరాళాల సేకరణ కోసం రాలేదని చెప్పి చర్చకు దారితీసిన జనసేన అధినేత తర్వాత చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈ సభలోనే భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘23 ఏళ్ల వయసులో దేశం కోసం భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు ఆయనను ఉరితీశారు. ఈ విషయంలో పవన్ ఎందుకు పొరపడ్డాడో కానీ, వెంటనే సరి చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ ఉరి వేశారని, అంత చిన్న వయసులో ప్రాణాలను బలిదానం చేసే ధైర్యం ఎవరికీ ఉంటుందని కవర్ చేసుకున్నాడు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్‌ను వ్యతిరేకిస్తున్న పలువురు భగత్ సింగ్ గురించి అన్న మాటలను మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. దీంతో ఇది వైరల్ అయింది. పవన్ ఫ్యాన్స్ మాత్రం మిగిలిన వీడియోను చూపిస్తున్నారు.