- పీఎన్‌బీ సెగ
- మేల్కొన్న నిఘా సంస్థలు, రెగ్యులేటరీ వర్గాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో చోటుచేసుకున్న రూ 11,000 కోట్ల భారీ అవకతవకల్లో మరో మూడు బ్యాంకులూ ప్రభావితమైనట్టు తెలిసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జారీ చేసిన హామీ పత్రాల (ఎల్‌ఓయూ) ఆధారంగా పీఎన్‌బీ సదరు క్లయింట్‌కు భారీగా రుణాలు మంజూరు చేసింది. విదేశీ బ్యాంకు శాఖలు బయ్యర‍్లకు ఇచ్చే రుణాల ఆధారంగా ఓ బ్యాంకు ఇతర బ్యాంకుల బ్రాంచ్‌లకు ఈ ఎల్‌ఓయూలను జారీ చేస్తుంది. ఈ బ్యాంకుల విదేశీ బ్రాంచ్‌లు సదరు జ్యూవెలరీ కంపెనీకి భారీగా రుణాలు ఇచ్చినట్టు సమాచారం. విదేశీ బ్యాంకు శాఖల రుణాలపై ఇప్పుడు నిఘా సంస్థలు, రెగ్యులేటరీ వర్గాలు దృష్టిసారించాయి.
జనవరి 16న అక్రమ ఎల్‌ఓయూలు తొలిసారిగా జారీ అయ్యాయని గుర్తించినట్టు సీబీఐకి పీఎన్‌బీ నివేదించింది. హాంకాంగ్, దుబాయ్, న్యూయార్క్ వంటి పలు చోట్ల దుకాణాలు నిర్వహిస్తున్న జ్యూవెలరీ కంపెనీ ఎల్‌ఓయూలపై 2010 నుంచి విదేశీ బ్యాంకు శాఖల నుంచి రుణాలు సమీకరిస్తోందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ల తరబడి ఎల్‌ఓయూ ఆధారంగా విచ్చలవిడిగా రుణాలు పొందినట్టు సమాచారం. ఎప్పటినుంచో ఈ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా జనవరి 25న చెల్లింపుల చట్రం నిలిచిపోవడంతో అసలు సమస్య వెలుగుచూసింది.
సదరు జ్యూవెలరీ సంస్థకు అందించిన సహకారం కొనసాగాలంటే రుణ వితరణపై 10 శాతం అదనపు మార్జిన్‌ను పీఎన్‌బీ అధికారులు డిమాండ్ చేయగా అందుకు జ్యూవెలరీ కంపెనీ నిరాకరించింది. ఈ చెల్లింపులకు జ్యూవెలర్ నిరాకరించడంతో పీఎన్‌బీ తన సేవలను నిలిపివేయడంతో మొత్తం వ్యవహారం గాడితప్పింది. ఎల్‌ఓయూలను పీఎన్‌బీ తిరస్కరించడంతో హాంకాంగ్ మానేటరీ అథారిటీ, ఆర్‌బీఐలకు ఫిర్యాదులు రావడంతో అవకతవకలు వెలుగుచూశాయి. ముంబయిలోని ఒక బ్రాంచ్‌లో రూ 11,359 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలు జరిగాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బుధవారం బీఎస్‌ఈకి తెలిపిన విషయం విదితమే.