సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగు నెలలే గడువు ఉండటంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలకు తెరతీస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెల్లడవుతుందనే ఊహాగానాలతో నియమావళి అమల్లోకి రాకముందే వరాలు జల్లులు కురిపించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మరింత సరళీకృతం చేయాలని బీజేపీ సర్కారు యోచిస్తోంది. 99 శాతం వస్తువులను 18 లేదా అంతకన్నా తక్కువ శాతం శ్లాబుల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు వెలువరించారు. మంగళవారం ఇక్కడ రిపబ్లిక్ టీవీ ఆధ్యర్యంలో జరిగిన ‘ఉత్తుంగ భారత్’ సదస్సులో మోదీ ప్రసంగిస్తూ ఈ అంశం గురించి ప్రస్తావించారు. 99 శాతం వస్తువులను 18 శాతం, అంతకన్నా తక్కువ శాతాల శ్లాబుల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వెల్లడించారు. కేవలం విలాసవంతమైన వస్తువులనే 28 శాతం శ్లాబులో ఉంచుతామని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలుకు ముందు 65 లక్షల సంస్థలు నమోద చేసుకోగా, ఇప్పుడు అదనంగా మరో 55 లక్షలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ విధానం వ్యాపార సంస్థలకు అనుకూలంగా అమలవుతోందని, రాష్ట్రాలతో చర్చించిన అనంతరం పన్నుల వ్యవస్థ మరింత మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. మార్కెట్ వ్యవస్థలో వైరుద్ధ్యాలు తొలగి సామర్థ్యం, పారదర్శకత పెరిగిందని వివరించారు. ఈ సందర్భంగా మరోసారి అవినీతి నిర్మూలన అంశాన్ని లేవనెత్తారు. అవినీతి నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశంలో అవినీతి సర్వసాధారణమే అన్న భావన ప్రజల్లో నెలకుందని, ఈ పరిస్థితి ఎందుకుండాలని ఆయన ప్రశ్నించారు. గతంలో రుణాలు తీసుకున్న సంస్థలు చెల్లించకపోయినా వాటిని ఏమీచేయలేకపోయేవారని, ఎందుకంటే దర్యాప్తు జరగకుండా కొందరు ‘ప్రత్యేక వ్యక్తులు’ వాటిని కాపాడటమేనని వ్యాఖ్యానించారు. సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.