YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నేత తిప్పేస్వామి ప్రమాణం

మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నేత తిప్పేస్వామి ప్రమాణం
ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడ్‌విట్ దాఖలుచేసిన మడకశిర ఎమ్మెల్యే కే. ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ప్రకటించగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్దించడంతో ఎమ్మెల్యే పదవికి ఈరన్న రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నేత తిప్పేస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ నేత ఈరన్న ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని మడకశిర నుంచి ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని ప్రకటించింది. దీన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఆరు మాసాల్లోగా తీర్పు రావాలని వ్యాఖ్యానించారు. కానీ, ఈ కేసులో మాత్రం నాలుగున్నరేళ్ల తర్వాత తీర్పు వచ్చిందని, ఏదేమైనా చివరికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అధికార పార్టీపై తిప్పేస్వామి విమర్శలు గుప్పించారు. హంద్రీనీవా కాల్వ ద్వారా మడకశిరకు నీళ్లు ఇప్పటివరకూ అందలేదని ఆరోపించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీనీవా పనులు 80 శాతం పూర్తయినా టీడీపీ ప్రభుత్వం ఇంకా నీళ్లు అందించలేకపోవడం దారుణమని దుయ్యబట్టారు. మడకశిరతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో పనిచేస్తానని ఆయన ప్రకటించారు. 

Related Posts