బుధవారం నాడు రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనలతో గురువారానికి వాయిదా పడింది.
సభ ప్రారంభమైన వెంటనే పలు అంశాలపై విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో ఆందోళనలు కొనసాగడంతో సభ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభను గురువారానికి వాయిదా వేశారు. సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు తరువాత పార్లమెంట్ ఆవరణలో కూడా ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయసాయిరెడ్డి గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లోపల ఎందుకు ఆందోళన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అవవగాహన లేమితోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వదిలేశారని విమర్శించారు. ప్యాకేజ్ కూడా కేంద్రం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు.