ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విశాఖపట్నంలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన హామీల అమలుపై జనవరి 3, 4 తేదీల్లో ఢిల్లీలో మిలిటెంట్ తరహా పోరాటం చేపడుతున్నామని తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే కనీసం చంద్రబాబు ఫోన్ ద్వారానైనా పరామర్శించలేదంటే ఎలాంటి రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయో ప్రజలు గ్రహించాలన్నారు.2019 లోక్సభ ఎన్నికలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు జ్ఞానభేరి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు..ఎవరికి జ్ఞానం అందించడానికి చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లే లేరని వెల్లడించారు.