YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

'మహాకూటమి' ఏర్పాటు ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగలనుందా?

 'మహాకూటమి' ఏర్పాటు ప్రయత్నాలకు  ఎదురుదెబ్బ తగలనుందా?
జాతీయ స్థాయిలో విపక్ష పార్టీల 'మహాకూటమి' ఏర్పాటు ప్రయత్నాలకు ఉత్తరప్రదేశ్లో ఎదురుదెబ్బ తగలనుందా? బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి జనవరిలో తన పుట్టినరోజు సందర్భంగా పొత్తుల వ్యవహారంపై 'బిగ్ అనౌన్స్మెంట్' చేయబోతున్నారని మాత్రం ఆ పార్టీ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ఇప్పటికే వ్యూహరచన జరుగుతోందని, 'మహాకూటమి'లో కాంగ్రెస్ ఉండకపోవచ్చని ఆ వర్గాల సమాచారం. చెరి సగం సీట్ల ప్రాతిపదికగా సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు అంగీకారం కుదిరిందని, అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) కూడా ఆ కూటమిలో ఉండబోతోందని చెబుతున్నారు. పొత్తులో భాగంగా ఆర్ఎల్డీకి 3 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయని, జనవరి 15న తన పుట్టినరోజు సందర్భంగా మాయావతి ఇందుకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నారని వారంటున్నారు. ఇదే జరిగితే 'మహాకూటమి' ఏర్పాటుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి దెబ్బే తగిలినట్టవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.కాగా, యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్బబ్బర్ కొద్దికాలంగా 2019 ఎన్నికల్లో 'మహాకూటమి' ఏర్పాటుపై తమ పార్టీ ఆశావహంగా ఉన్నట్టు చెబుతున్నారు. విపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలని యూపీ ప్రజలు కోరుతున్నారని ఆయన అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనంటూ మాయావతి ఇటీవల ఘాటు విమర్శలు చేయగా, మహాకూటమికి రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి, ఢిల్లీలో జరిగిన మహాకూటమి సమావేశానికి మాయావతి, అఖిలేష్ దూరంగా ఉన్నారు.

Related Posts