కొన్ని రాజకీయ పార్టీల నేతలకు రైతు అంటే అర్థమే తెలీదని, వారేమీ నాయకులని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే నెల 6న ఏపీకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి... రాష్ట్రానికి చేసిన న్యాయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెథాయ్ తుఫాన్ రాష్ట్రాన్ని తాకడం, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి రావడం ఒకేసారి జరిగిందన్నారు. పెథాయ్ తుఫాన్ ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు వారం రోజుల నుంచే ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షిస్తూ ప్రజలకు సమాచారమందిస్తూ వచ్చారన్నారు. ఇటీవల తిత్లీ తుఫాన్ సమయంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుంటూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి, అటునుంచి అటే వెళ్లిపోయారన్నారు. కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదన్నారు. ఇదేనా వారికి ప్రజల పట్ల ఉండే బాధ్యత అని మంత్రిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. విజయనగరం పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న శ్రీకాకుళంలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి కూడా వెళ్లలేదన్నారు. రైతులు అంటే అర్థం తెలీని వారు ఎక్కడో కూర్చుని మాట్లాడతారా? అని మండిపడ్డారు. తుఫాన్ బాధితులను పరామర్శించని నాయకులు వాళ్లేమి నేతలని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో నరేంద్రమోడి చెప్పాలి?
విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రధాని చేసిందేమీ లేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజ్ పట్నం పోర్టు వంటి ఎన్నో అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ తమదైన గుర్తింపునకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాయన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలో అన్ని ప్రాంతాలనూ కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరుతో భారీ ఎత్తున రోడ్లు చేపట్టిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చేపట్టి పేదలకు ఉపాధి కల్పించిన ఘనత యూపీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇటువంటి పథకాలు ప్రధాని నరేంద్రమోడి చేపట్టలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా, రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు.