పలనాటి చరిత్రలో కోడి పందాలే ముఖ్యమైన ఘట్టం. సరదాగా ప్రారంభమైన ఈ పందేలు క్రమంగా గెలుపోటములు, పట్టింపులు, పౌరుషాలకు ప్రతీకగా మారాయి. పల్నాటి యుద్ధం నాటి నుంచి నేటివరకు సంక్రాంతి పండుగ నెల ప్రారంభం నాటి నుంచి కోడి పందేలు ఆడటం ఆనవాయితీగా మారిపోయింది. ప్రభుత్వం కోడి పందేలను నిషేధించినప్పటికి పల్లెప్రాంతాల్లో అవి విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. కోట మండలంలోని కేశవరం, మద్దాలి, కొత్తపాళెం, గూడలి, కొత్తపట్నం పంచాయతీల్లో కోడి పందేల జోరు పెరిగింది. ఈ పందేలు జరిగేచోట మూడుముక్కలాట, డైమాన్ డబ్బా వంటి జూదాలతో పాటు జూదరుల దాహార్తి తీర్చేందుకు, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు మద్యం విక్రయాలు కూడా చేస్తుంటారు. చావోరేవో తప్ప వెన్నుచూపని వీరుల మధ్య యుద్ధం, కాసుల గలగల మధ్య రెప్పపాటులో ఫలితం పోరు కోళ్లదైనా లక్షలు మావేనంటూ సంక్రాంతి సంబరాల వేళ పందెగాళ్లలో హుషారు జోరందుకుంటుంది. అప్పట్లో వెలమదొరలకే పరిమితమైన కోడిపందేలు నేడు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు విస్తరించాయి. కాకపోతే నాటి ఆటవిడుపు నేడు జూదంగా మారి శాంతిభద్రతలకు సమస్యగా మారింది. కోళ్లను పెంచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే పందెపురాయుళ్లు పందెం వేసే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా పల్లెటూళ్లలో జరిగే రోజువారీ పందేలు కాకుండా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పందెగాళ్లు కోడిపుంజులను సాధారణంగా వాటి రంగులను బట్టి డేగ, నెమలి, కాకి, మైలా అంటూ వర్గీకరిస్తారు. డేగల్లో సూరి (తెలుపు), కోడిడేగ (ఎరుపు, తెలుపు ఈకలు), సుద్ధడేగ (పూర్తిగా ఎరుపు), కాకిడేగ (నలుపు, ఎరుపు) రకాలు ఉంటాయి. నలుపు నెమలి, కాకి నెమలి, నెమలి పింగళాలుగా కూడా వర్గీకరిస్తారు. రంగు పుంజుల్లో నల్లకాకి, కోడి కాకి, పచ్చకాకి, కోడిపచ్చకాకి, ఎరుపు మించిన కాకి, మైలాల్లో నల్లమైలా, తెల్లమైలా, ఎర్రమైలా, నెమలి మైలా రకాలుగా వ్యవహరిస్తారు. అన్ని కోడిపుంజుల్లోనూ పింగాళలనబడే పుంజులు బలమైనవని పందెగాళ్లు అంటుంటారు. కోడిగూబ మీద ఈకలు ఉంటే వాటిని పింగాళకోడి అంటారు. నల్లగోళ్లు కలిగిన కోడి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడుతుందని, ఈ కోడి ఖరీదు రూ.50 వేల వరకు ఉంటుందని పందెగాళ్లు అంటున్నారు. వారాలను వెనె్నల, చీకటి వారాలుగా సంభోదిస్తారు. పందేలను ముసుగు పందెం, ఎత్తుడు, దింపుడు పందెం, చూపుడు పందెం, డింకీ పందెం నిర్వహిస్తారు. ముసుగు పందెంలో ఎవరూ ప్రత్యర్థి కోడిని చూడరు. ముసుగువేసి తెచ్చిన కోళ్లను కనీసం వాటి బలబలాల అంచనాలైనా తెలియకుండా పందెం మొత్తం ఖరారు చేసుకొని ఒక్కసారిగా బరిలోకి దించుతారు. ఎత్తుడు, దింపుడు పందేలలో ఇరువర్గాల వారు పదేసి కోళ్లతో రంగంలోకి దిగుతారు. వరుసగా కోళ్లను బరిలోకి దించి చివరకు ఎవరి కోడి మిగిలితే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. చూపుడు పందెం అంటే సాధారణంగా జరిగే పందేలు. అసలు లేదా డింకీ పందెంలో కోళ్లను కత్తులు లేకుండా రంగంలోకి దించుతారు. అయితే ఈ రకం పందెంలో సమయం ఎక్కువగా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ పందేలు ఆడటం లేదు. కోడి పందేలు జరిగేచోట వినోదంతో పాటు విషాదం కూడా ఉంటుంది. తాగిన మైకంలో ఒకరిపై మరొకరు ఘర్షణలకు దిగుతుంటారు. కొందరైతే ఈ పందేల మోజులో భార్య మెడలోని తాళీను సైతం తాకట్టు పెడుతుంటారు.