దక్షిణ భారత్‌లోనే అతి ప్రాచీనమైన విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలకు విద్యార్థులు కరవయ్యారు. గత ఐదేళ్లుగా ఈ కళాశాలలో ఒక్క అడ్మిషన్ కూడా జరగకపోవడంతో కళాశాల మనుగడే ప్రశ్నార్థకమైంది. 1860లో విజయనగర గజపతులు ఈ పాఠశాలను స్థాపించారు. 1957 నుంచి ప్రభుత్వ ఆధీనంలో దీనిని నిర్వహిస్తున్నారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్ చేసినప్పటికీ గత ఐదేళ్లుగా ఏ విద్యార్థి ఇందులో చేరడానికి ఆసక్తి కనబరచడం లేదు. ఒకప్పుడు వేద ఘోషతో వర్థిల్లిన ఈ కళాశాల, నేడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. గత ఐదేళ్లుగా ఒక విద్యార్థి, ఒక ప్రిన్సిపాల్, ఒక వాచ్‌మెన్‌తోనే కళాశాలను నెట్టుకొస్తున్నారు. ఆ విద్యార్థికి కూడా వచ్చే ఏడాది మార్చితో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తికానుంది. దీంతో ఈ కళాశాలను కొనసాగిస్తారా? లేక మూసివేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో సంస్కృత కళాశాలను ఆనుకొని ఉన్న ఫీడర్ పాఠశాల నుంచి కొద్దిమంది విద్యార్థులు ఈ సంస్కృత కళాశాలలో చేరేవారు. నేడు ఆ పరిస్థితి కన్పించడం లేదు. నేడు వేదాలు అభ్యసించే వారికి ప్రభుత్వ పరంగా ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో ఆ కోర్సులు నేర్చుకునేందుకు విద్యార్థులు విముఖత చూపుతున్నారు. మరోపక్క ఇక్కడ చేరిన విద్యార్థులకు ఉపకార వేతనం మినహా వసతి సౌకర్యం లేకపోవడం మరో కారణం. ఇదిలా ఉండగా ఇక్కడ తెలుగు, సంస్కృతం రెండు సబ్జెక్టులకు రెండు వర్శిటీలలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగు పరీక్షను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుండగా, సంస్కృత సబ్జెక్టును తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ విధంగా ఒకే విద్యార్థి రెండు వర్శిటీలలో పరీక్ష రాయాల్సి వస్తోంది. సంస్కృత కళాశాలలో వేదాలు అభ్యిసించిన వారికి ఉపాధి దొరకడం లేదన్న కారణంగానే విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదని ప్రిన్సిపాల్ స్వప్నహైందవి పేర్కొన్నారు. ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో రామనారాయణంలో వేదపాఠశాలను నిర్వహించడంతో ఇక్కడ చదువుతున్న 13 మంది విద్యార్థులు అక్కడ చేరారు. అక్కడ భోజన వసతి, టీటీడీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో విద్యార్థులంతా అటు వైపు మొగ్గుచూపారు. దీంతో ఈ కళాశాల బోసిపోయినట్టయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాల మూసివేయాల్సిందేనని చెప్పక తప్పదు.