రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడలానే ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రతిపక్ష కూటమిలో కచ్చితంగా ఉండాల్సిన సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. అయితే, ఇక్కడ బలంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఈ పొత్తులో కాంగ్రెస్ కి కేవలం రెండు స్థానాలు మాత్రమే వదిలేశాయి. అవి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలి, అమేథి మాత్రమే వదిలేశారు. అఖిలేష్ నేతృత్వంలోనే ఎస్పీ 37 స్థానాల్లో, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అజీత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీకి కూడా మూడు సీట్లు వదిలిపెట్టారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు వదిలేయడాన్ని బట్టి చూస్తే కూటమిలో కాంగ్రెస్ ఉన్నా.. లేకున్నా పర్వాలేదన్నట్లు ఎస్పీ, బీఎస్పీ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీనే ఉంటారని పేర్కొనడాన్ని కూడా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించారు. స్టాలిన్ ది ఆయన అభిప్రాయం మాత్రమేనని… స్టాలిన్ అభిప్రాయం, కూటమి అభిప్రాయం ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీతో ప్రజలు సంతోషకంగా లేరన్నారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, శరద్ పవార్ కూడా ప్రతిపక్షాలను ఒక్కటి చేసి కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని అఖిలేష్ పేర్కొన్నారు. ఇక, బీఎస్పీ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రాన కచ్చితంగా కూటమిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలనే ఒత్తిడి బీఎస్పీపై ఉండదని ఆ పార్టీ నేత అనుభవ్ చాక్ పేర్కొన్నారు.