ఎర్రజెండాకు ఏమైంది…? కామ్రేడ్లు ఇక కనుమరుగు కావాల్సిందేనా? ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కమ్యునిస్టులకు చోటు లేదా? తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత వామపక్ష పార్టీల నేతల్లో జరుగుతున్న అంతర్మధనమిది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు శాసనసభలో కమ్యునిస్టులకు ప్రాతినిధ్యం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎర్రజెండాలు కన్పించకపోయినా తెలంగాణలో మాత్రం కమ్యునిస్టు పార్టీ సభ్యులు గెలిచి ఒకింత పార్టీని నిలబెట్టారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఒక్కరూ గెలవకపోవడంతో ఏపీ సీన్ తెలంగాణలోనూ రిపీట్ అయింది. సీపీఐ, సీపీఎం పార్టీలు వేరుపడటం వల్లనే ఈపరిస్థితి తలెత్తిందన్న వాదన కూడా లేకపోలేదు.ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కమ్యునిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలి నుంచి ఖమ్మం జిల్లా కమ్యునిస్టులకు కంచుకోటగా ఉండేది. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి శాసనసభకు వీరి ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేది. గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లా కావడం, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఎర్రజెండాలు ముందుండటంతో వీరికి ప్రజలు పట్టం కట్టేవారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఎంతోగానో నమ్మకం పెట్టుకున్న ఖమ్మం జిల్లాలో సయితం కమ్యునిస్టు పార్టీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది.ప్రతి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి సీపీఐ, సీపీఎం, సీపీఎం న్యూ డెమొక్రసీ పార్టీల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం ఉండేది. పదిహేను సార్లు ఎన్నికలు జరగ్గా జిల్లాలో సీపీఎం, సీపీఐ, న్యూడెమొక్రసీ పార్టీలు కొన్ని చోట్లనుంచైనా గెలిచేవి. పదిహేను సార్లలో సీపీఎం నాలుగుసార్లు, సీపీఐ నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించాయి. వరంగల్ జిల్లాలో కలసి ఉన్నప్పుడు కూడా ఇక్కడ విజయాన్ని చవిచూసిన కమ్యునిస్టు పార్టీలు చతికలపడటానికి కారణాలను ఆపార్టీ నేతలు అన్వేషిస్తున్నారు. మధిర నియోజకవర్గంలో సయితం బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకటనర్సయ్య, కె.వెంకయ్యలు ఎర్రజెండాల నీడలో ఆరుసార్లు విజయం సాధించారు. ఇక భద్రాచలం పెట్టని కోట. ఇక్కడ పదహారుసార్లు ఎన్నిక జరగ్గా ఎనిమిదిసార్లు సీపీఎం, మూడు సార్లు సీపీఐ గెలవడం విశేషం. పాలేరు నియోజకవర్గంలోనూ పదిహేను సార్లు ఎన్నిక జరగ్గా సీపీఎం రెండుసార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి.వైరా నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరిగితే సీపీఐ ఐదు సార్లు విజయం సాధించింది. కొత్తగూడెంలోనూ కమ్యునిస్టు పార్టీలు సత్తా చాటాయి. కొత్తగూడెంలో రెండుసార్లు సీపీఎం గెలిచింది. ఇల్లెందు నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరగ్గా సీపీఐ ఎంల్ న్యూడెమొక్రసీ ఆరుసార్లు గెలిచింది. ఇందులో గుమ్మడి నరసయ్య ఒక్కరే ఐదుసార్లు గెలవడం విశేషం. పినపాక నుంచి ఐదు సార్లు సీపీఐ విజయం సాధించింది. అయితే ఈ దఫా మాత్రం జిల్లాలో సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలకు ఒక్క స్థానమూ దక్కలేదు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు, లేదా నాలుగోస్థానంలోనే వామపక్ష పార్టీ అభ్యర్థులు నిలవడం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యునిస్టు పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది