ఒకానొక గ్రామంలో ఒక ఆశ్రమం ఉండేది. ప్రతి రోజూ సాయంత్రం ఆశ్రమంలో ఒక సాధువు ప్రవచనం చెప్పేవాడు. గ్రామస్థుల్లో చాలామంది ఆ ప్రవచనం వినడానికి వెళ్లే వాళ్లు. ప్రవచనం పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతుండేవారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రతి రోజూ ప్రవచనం మధ్యలో ఉండగానే లేచి అక్కడి నుంచి వెనుదిరిగేవాడు. ఆ వ్యక్తి.. ప్రతి రోజూ ప్రవచనం మధ్యలోనే వెళ్లిపోవడం సాధువు గమనించాడు. ఒకరోజు అతణ్ణి పిలిచి.. ‘‘నాయనా! రోజూ ఎందుకలా మధ్యలోనే వెళ్లిపోతున్నావు?’’ అని అడిగాడు. దానికా వ్యక్తి.. ‘‘స్వామీ! మీ ప్రవచనం అద్భుతంగా ఉంటుంది. అయితే, చీకటి పడేలోపు నేను ఇంటికి వెళ్లిపోవాలి. నా కోసం నా భార్యా, బిడ్డలూ, తమ్ముళ్లూ, మరదళ్లూ, వారి పిల్లలూ.. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నా రాక కాస్త ఆలస్యం అయినా.. తట్టుకోలేరు. నాపై వారికంత ప్రేమ. అందుకే మధ్యలోనే వెళ్లిపోతున్నాను’’ అని బదులిచ్చాడు. సాధువు నవ్వి.. ఆ వ్యక్తి చెవిలో ఒక విషయం చెప్పాడు.
మరుసటి రోజు ఆ వ్యక్తి యథాప్రకారంగా ప్రవచనం మధ్యలో లేచి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య మురిసిపోయింది. పిల్లలు తండ్రితో ఆడుకుంటున్నారు. తమ్ముళ్లూ, మరదళ్లూ ఏవో కబుర్లు చెబుతున్నారు. అంతలో.. ఆ వ్యక్తి మూర్చ వచ్చి పడిపోయాడు. ఇంట్లో అందరూ కలవరపడసాగారు. ఇంతలో సాధువు వాళ్లింటికి వచ్చాడు. తమ ఇంటి యజమానికి ఎలాగైనా కాపాడమని సాధువుతో అందరూ వేడుకున్నారు. అందరినీ సంయమనం పాటించమన్నాడు సాధువు. లోనికి వెళ్లి ఒక పాత్రలో నీరు తీసుకురమ్మని చెప్పాడు. అలాగే తెచ్చారు. ‘‘బాధ పడవలసింది ఏమీ లేదు. మీ ఇంటి యజమానికి దుష్టగ్రహం పట్టింది. దానిని ఈ పాత్రలోని నీటిలోకి ఆవాహన చేస్తాను. అయితే, మీలో ఎవరో ఒకరు ఆ నీటిని తాగి.. ఆ దుష్టగ్రహాన్ని గ్రహించాలి’’ అన్నాడు. ఆ మాట వినడంతోనే ఇంట్లో వాళ్లందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘‘మా ఇంటి యజమానిపై మాకు ప్రేమ ఉన్న మాట వాస్తవమే! ఆయన బాధ తప్పించాలనే భావన ఉన్న మాటా నిజమే! కానీ, చూస్తూ.. చూస్తూ.. దుష్టగ్రహ బాధను ఎవరు తీసుకుంటారు. అయినా స్వామీ! ఎవరి కర్మ వారు అనుభవించాలని మీరే చెబుతారు కదా! ఇది ఆయన కర్మ.. ఆయన్నే అనుభవించనీయండి’’ అని బదులిచ్చారు. ఆ మాటలు విన్న తర్వాత ఆ ఇంటి యజమానికి అసలు విషయం తెలిసొచ్చింది. అంతసేపూ మూర్చతో పడిపోయినట్టు నటించిన ఆ వ్యక్తికి.. వాస్తవం ఎలా ఉంటుందో బోధపడింది. సంసార బంధాలు, కుటుంబ బాధ్యతలు అందరూ ఆచరించాల్సిన ధర్మాలే. అయితే, అవే ముఖ్యమనుకొని వాటిలోనే పడి కొట్టుకుపోతే.. ముక్తిని పొందాల్సిన మానవ జన్మ పరమార్థం పక్కదారి పడుతుంది! భగవంతుడిని దర్శించాలన్న కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది.
ఉడిపిలోని శ్రీ విశ్వతీర్ధ స్వామీజీని గరుడాళ్వారే స్వయంగా వేంచేసి క్షేమసమాచారం కనుక్కున్నారట. . విశ్వతీర్ధ స్వామీజీ ఆరోగ్యం సహకరించనప్పటికీ తమ నిత్య తిరువారాధన, సాలగ్రామ ఆరాధన మానలేదు.