మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మరాత్రి పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. జ్ఞాన ప్రసూనాంబ దేవి, వాయులింగేశ్వరస్వామి వారు అధిరోహించిన రథాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తుల నామస్మరణలతో శ్రీకాళహస్తి మారుమోగింది. ఉప్పు, మిరియాలను రథాలపై చల్లి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లు రథాలపై మాఢ వీధులలో ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.