ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాడిపేటలో ఎన్టీఆర్ గృహాలను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని చెప్పారు. కేంద్రంపై పోరాడేందుకు జగన్, పవన్కు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కు వైసీపీ, జనసేన వంత పాడుతున్నాయని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా జిల్లాల కంటే రాయలసీమను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అయినా ఎవరెన్ని కుట్రలు చేసినా తనను ఏమీ చేయలేరన్నారు.
తిరుపతి, చెన్నై, నెల్లూరు మధ్య సిలికాన్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వర్షాలు పడకపోయినా 11శాతం అభివృద్ధి సాధించామని వెల్లడించారు. మూడేళ్లలో 2, 618 ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇక పరిశుభ్రతలో 6వ స్థానం, భద్రతలో రెండో స్థానంలో ఉన్నామని గుర్తుచేశారు. తిరుపతి.. ఏపీకే ఆరోగ్య కేంద్రంగా ఉంటుందన్నారు. తిరుపతిని ప్రపంచపటంలో పెట్టడమే తన లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.