విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి ఒడిశా పెడుతున్న మెలికలు, వాదనలు.. మరోవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ రాద్దాంతం మధ్య అధికారులు ఇరుక్కుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఒడిశా వాదనలను గానీ, ఇటు ఎపికి విభజన హామీల్లో ఇచ్చిన విషయాల పట్ల గానీ మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని కనబరచకపోవడం విచారకరం. తాజాగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే భువనేశ్వర్ ఉన్నతాధికారులు కేంద్ర రైల్వేబోర్డు వద్ద అనేక ప్రతిపాదనలను ముందుకు తెచ్చినా కేంద్రం పట్టించుకునే పరిస్థితులే కానరావడం లేదు.ఒడిశా రాష్ట్రానికి చెందిన సరైకల్ జిల్లా టాటానగర్ లైన్ సౌత్ ఈస్ట్రన్ రైల్వే (పశ్చిమబెంగాల్)లో ఉండిపోవడంతో ముఖ్యమైన ఐరన్ ఓర్ ఇక్కడే ఉన్నందున ఒడిశాకు ఇది కావాలంటూ భువనేశ్వర్ ప్రధాన కార్యాలయం డిమాండ్‌గా ఉంది. పశ్చిమ (వెస్టర్న్) ఒడిశాలో భాగమైన సంబల్‌పూర్‌లో కొంతభాగం బిలాస్‌పూర్ డివిజన్‌లో ఉండిపోయింది. సరకుల రవాణాకు సంబంధించి పైన తెలిపిన రెండు ప్రాంతాల నుంచి సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం ఒడిశాకు రావాల్సింది బెంగాల్ రైల్వేకు వెళ్లిపోతుందన్నది వాదన. ఈ నేపథ్యంలో రాయగడ, కోరాపుట్ ఏరియాలో ఒక డివిజన్‌ను సృష్టించాలని కేంద్రాన్ని ఒడిశా కోరుతుంది. వెస్టర్న్ ఒడిశాలోని రూర్కెలాలో స్టీల్‌ప్లాంట్ ఇప్పటికే ఉన్నందున, ఇక్కడ ఐరన్ ఓర్ మైనింగ్, మాంగనీసు ఉండడంతో దీంట్లో మేజర్ పార్టు సౌత్ ఈస్ట్రన్‌లో ఉంది. పైన పేర్కొన్న వాటిని కలిపి ఒక డివిజన్ ఏర్పరిస్తే ఈస్ట్‌కోస్ట్ డివిజన్ నుంచి రూ.6,800కోట్లు ఆదాయం తెచ్చిపెట్టే కెకెలైను లేకపోయినా ఈస్ట్‌కోస్ట్ డివిజన్ (భవనేశ్వర్)కు ఢోకా ఉండదని ఒడిశా భావిస్తోంది. తూర్పుకోస్తా రైల్వేలో ఖుర్దా రూ.7,900 కోట్లు, సంబల్‌పూర్ రూ.800 కోట్లు, వాల్తేరు రూ.7,500 కోట్లు (కెకెలైను కలిపి) ఆదాయం ఏటా డివిజన్లు తెస్తున్నాయి. తూర్పుకోస్తా రైల్వేలో వాల్తేరు జోన్‌ను ఏర్పాటు చేయాల్సి వస్తే సరైకల్ జిల్లా, బిలాస్‌పూర్ ఒడిశాలోకి రావాల్సిందేనని, దీనివల్ల పైన తెలిపినట్లు రూ.3 వేల కోట్లుపైనే ఆదాయం బేలన్స్ చేయగల్గుతామని ఒడిశా అధికారులు చెబుతున్నారు. తూర్పు కోస్తా రైల్వేకు కెకెలైను ద్వారా ప్రస్తుతం వచ్చే రూ.6,800 కోట్ల ఆదాయంలో ఒడిశా నుంచి వాల్తేరును వేరు చేసినా పశ్చిమబెంగాల్‌లో తమ భాగంగా ఉండిపోయిన ప్రాంతాలను కలపుకోవడం ద్వారా రూ.3 వేల కోట్లు రికవరీ అవుతుందని, మిగతా రూ.3,800 కోట్లు కూడా ఫ్రైట్‌స్టేషన్స్ ఒడిశా మీదుగా రాకపోకల ద్వారా కవర్ చేయవచ్చన్నది వారి వాదన. ఆద్రా, చక్రధర్‌పూర్, రాంచీ, ఖరగ్‌పూర్‌లున్నాయి. సౌత్ ఈస్ట్రన్ రైల్వే నుంచి 3 భాగాలు 2003లో వేరుపడ్డాయి.. వాటిలో కొల్‌కత్తా కేంద్రంగా సౌత్ ఈస్ట్ రైల్వే (ద.మ.రైల్వే)... దీంట్లో నాలుగు డివిజన్‌లు న్నాయి.. రెండోది భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే (3 డివిజన్‌లు), మూడోది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వీటిలో 3 డివిజన్‌లు బిలాస్‌పూర్, రాయపూర్, నాగపూర్ ఉన్నాయి. ఒడిశా తమ ఆదాయ వనరులన్నీ సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ఉండిపోయాయంటూ వేలెత్తిచూపుతున్నా పరిష్కారం కేంద్రం చేయడం లేదు.రైల్వే బోర్డు ప్రణాళిక ఏమిటి?మౌలిక వసతుల కల్పన, ఆఫీసర్ల నియామకం, ప్రాంతీయ వాదాలు బలపడకుండా కొత్త జోన్ల ఏర్పాటుకు రైల్వేబోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గుల్‌బర్గా, ఉత్తరాఖండ్‌లోనూ రైల్వేజోన్‌పై డిమాండ్‌లున్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఒక భాగం సదరన్ రైల్వేలో ఉండడంతో ఇక్కడ కూడా జోన్ అడిగే అవకాశాలున్నాయని రైల్వేబోర్డు చెబుతోంది.