ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్తి ఉన్నప్పటికీ, పార్టీపై అంతగా లేదన్న నిర్ణయానికి వచ్చారు. అయితే తెలంగాణాలో మాదిరిగా ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వృధా అని టీడీపీ అధినేత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ మాత్రం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బల పడాలంటే పొత్తు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి అక్కడ పొత్తులైనా, సీట్లైనా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిదే ఫైనల్ అని చెప్పనున్నారు. అయితే రాహుల్ ఆలోచనలకు విరుద్ధంగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. కలసి పోటీ చేస్తే జగన్ లబ్ది చెందుతారని చంద్రబాబు భావించడమే ఇందుకు కారణం. అందుకే బలమైన అభ్యర్థులున్న ప్రాంతంలో కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. కాంగ్రెస్ కు పడే ఓట్లన్నీ జగన్ ఓటు బ్యాంకు నుంచి వచ్చేవని ఆయన విశ్వసిస్తున్నారు. ఆయన ఈ మేరకు ఒక నివేదిక రూపంలో రాహుల్ గాంధీకి అందజేయనున్నారు.ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా త్వరలోనే చర్చించనున్నారు. ఈ నెల 25వ తేదీన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో చర్చించనున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. రాహుల్ ఏపీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.ఎటూ ఎన్నికలయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుంది కాబట్టి టీడీపీ ఎంపీలు గెలిచినా పెద్దగా నష్టం లేదన్న వాదనను చంద్రబాబు చేయనున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటే అక్కడ టీడీపీ సులువుగా గెలుస్తుందన్న అంచనాలో బాబు ఉన్నారు. ఉదాహరణకు కర్నూలు నియోజకవర్గం తీసుకుంటే అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి టీడీపీ, వైసీపీలు పోటీ చేస్తే అది టీడీపీకి లాభిస్తుందని చెబుతున్నారు. అలాగే శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు. బాపట్ల, కాకినాడ, నర్సాపురం వంటి పార్లమెంటు స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించి భారీగా ఓట్లు సాధించే ప్రయత్నం చేస్తే అది టీడీపీకి లబ్ది చేకూరుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపైనా ఉంటుందని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఏపీ ఎన్నికల్లో పొత్తు లేకుండా వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ఎన్నికల అనంతరం తాము భాగస్వామి అవుతామని చంద్రబాబు రాహుల్ కు చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనికి రాహుల్ నుంచి పెద్దగా అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు గెలిచినా అది కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే ఎన్నికల అనంతరం ఇక్కడ కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని, అవసరమైతే ముఖ్యనేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెప్పనున్నట్లు తెలుస్తోంది. అలాగైతేనే జగన్ ను ఓడించగలుగుతామని టీడీపీ నేతలు అంటున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.