కోల్డ్ వార్ ముగిసేటట్లు లేదు. ఒకరి నొకరు పలుకరించుకోవడం కూడా కష్టమే. ఇక ఒకే వేదికను పంచుకోవడమూ ఈ మధ్యకాలంలో జరగలేదు. ఉప్పు నిప్పులా తయారయ్యారు. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అన్నది పక్కనపెడితే తెలుగుదేశం పార్టీలో నెంబరు 2 స్థానంలోఉన్న ఆయనకు ఇప్పుడు ఆయన పేరు వింటేనే చిర్రెత్తుకొస్తుందట. వారే విజయనగరం పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, మంత్రి గంటా శ్రీనివాసరావుకు గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. ఇద్దరి మధ్య పూడ్చలేని విధంగా అగాధం ఏర్పడిందంటున్నారు.తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు. గంటా శ్రీనివాసరావు అనేక పార్టీలు మారి వచ్చారు. అయితే విజయనగరం జిల్లాకు గంటా శ్రీనివాసరావు ఇన్ ఛార్జిమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేసే సమయంలో వీరి మధ్య విభేదాలు పొడసూపాయి. సహజంగా విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు మాట చెల్లుబాటు అవుతుంది. చంద్రబాబు నాయుడు సయితం ఆయన మాటకే విలువ ఇస్తారు. కానీ అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రతిపాదించిన పేరును కాదని ఇన్ ఛార్జి మంత్రి గంటా మరోపేరును అధిష్టానానికి ఇవ్వడం రాజుగారికి ఆగ్రహం కల్గించిందంటున్నారు. అప్పటి నుంచి అశోక్ గంటా అంటేనే మండిపడుతున్నారు.జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు, వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఇన్ ఛార్జి మంత్రి హాజరవుతారు. కేంద్ర మంత్రిగా అశోక్ ఉన్న సయమంలో ఎక్కువగా ఆయన ఢిల్లీలో ఉండేవారు. అప్పుడు గంటా ఎక్కువగా జిల్లాలో జరిగే కార్యక్రమాల్లోపాల్గొనే వారు. కానీ అశోక్ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎక్కువగా జిల్లాలోనే ఉంటున్నారు. ఈ దశలో గంటా విజయనగరం వైపు రావడమే మానేశారంటున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు కలసి ఒకే వేదిక పంచుకున్నది కేవలం రెండు, మూడుసార్లు మాత్రమే కావడం గమనార్హం. శ్రీనివాసరావు అశోక్ అనుచరులుగా ఉన్న కొందరు బీసీ నేతలను సయితం తమవైపునకు తిప్పుకోవడాన్ని రాజుగారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై చంద్రబాబుకు అశోక్ గజపతి రాజు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఏకంగా గంటాను ఇన్ ఛార్జి మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ చంద్రబాబు కు చెప్పనట్లు సమాచారం. తన జిల్లాలో అనవసరంగా పార్టీలో విభేదాలు పెంచి పోషిస్తున్నారని, ఆయనను తక్షణమే తప్పించాలని అశోక్ ఒకింత సీరియస్ గానే చంద్రబాబుకు చెప్పడంతో ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు గంటాకు క్లాస్ పీకినట్లు కూడా చెబుతున్నారు. తాను విజయనగరం జిల్లాలో జోక్యం ఇకపై చేసుకోబోనని చంద్రబాబుకు గంటా వివరణ ఇచ్చుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు, మంత్రి గంటా శ్రీనివాసరావుకు మధ్య గ్యాప్ పెరగడం పార్టీకి మంచిది కాదని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు