డీఎంకే అధినేత స్టాలిన్ పుణ్యమా ? అని రాహుల్ గాంధీని ఒక ప్రధాన మిత్రపక్షం ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. గతంలోనే తాను రేసులో ఉన్నానంటూ రాహుల్ చెప్పినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెసు పార్టీలోని నాయకులు మాత్రం ఎప్పట్నుంచో ప్రధాని అభ్యర్థేనంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నవారు చాలావరకూ మౌనం వహించారు. కానీ కాబోయే మిత్రపక్షాలు మాత్రం భిన్నంగా స్పందించాయి. తాజాగా డీఎంకే ప్రకటన రాహుల్ కు కొంత నైతికస్థైర్యాన్నిస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. మోడీతో పోటీ పడే కరిష్మా తమ నేత కూడా సంతరించుకుంటున్నారని కాంగ్రెసు చెప్పుకోవడం ప్రారంభించింది. వివిధ రకాల సమీకరణలు రాహుల్ కు అనుకూలంగా ఉన్నాయంటూ పోలికలు మొదలుపెట్టారు. వివిధ రాజకీయపార్టీలను కలుపుకొని పోవడంలో తమ అధినేత చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారని హస్తం పార్టీ చెబుతోంది. సంకీర్ణాల యుగంలో ఇంతకుమించిన సమర్థత ఏముంటుందని ప్రశ్నిస్తోంది.సోషల్ మీడియా హడావిడి రాజకీయాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 2014లో దీనికి నాంది పలికింది నరేంద్రమోడీ అని చెప్పాలి. స్పందనలు, ప్రతిస్పందనలు ఎక్కువగా కనిపించే ట్విట్టర్ లో ప్రధాని మోడీకి 4కోట్ల 50 లక్షల మందికిపైగా అనుసరించేవారు ఉన్నారు. రాహుల్ కు 80 లక్షల పైచిలుకు ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే మోడీ దే పైచేయి. చేస్తున్న ట్వీట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో రాహుల్ కొన్నివిషయాల్లో పైచేయి సాధించారని సామాజిక మాధ్యమాలను అనుసరించేవారు ఘంటాపథంగా చెబుతున్నారు. రిట్వీట్ల విషయంలో రాహుల్ మోడీని మించిపోయారంటున్నారు. రాహుల్ ప్రధానంగా మూడు అంశాల చుట్టూనే తన ట్వీట్లను తిప్పుతున్నారు. మోడీపై విమర్శల బాణం ఎక్కుపెట్టడం, రైతు సమస్యల ప్రస్తావన, నిరుద్యోగం పై ఎక్కువగా తన దృష్టి సారిస్తున్నారు. దీంతో మోడీ వ్యతిరేకులు బాగానే స్పందిస్తున్నారు. రైతు సమస్య, నిరుద్యోగం వంటివి ఎక్కువమంది ప్రజలు, యువతతో ముడిపడి ఉండటంతో రిట్వీట్ల పంట పండుతోంది. అదే సమయంలో ప్రధాని మోడీ దౌత్య, విదేశీ వ్యవహారాలు, పరిపాలన వంటి విషయాలపై కూడా ఎక్కువగా ట్వీట్లు పెడుతున్నారు. వీటిపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో నెటిజన్లు పట్టించుకోవడం లేదు. ఆరకంగా ప్రధాని రేటింగు పడిపోయింది. నిజానికి సోషల్ మీడియా లీడర్ గా మోడీని చెబుతుంటారు. కానీ ప్రత్యర్థి రాహుల్ కు కొన్ని అంశాల్లో అయినా ఆ స్పేష్ ను వదలాల్సి రావడం గమనించదగ్గ అంశమే.సంక్షేమ పథకాల విషయంలో రాహుల్ విసురుతున్న సవాళ్లు బీజేపీని చికాకు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రుణ మాఫీ అమలు చేస్తున్నామని చెబుతున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి వాటిని ఉదాహరణగా చూపుతున్నారు. అతి తక్కువ రాష్ట్రాల్లోనే కాంగ్రెసు అధికారంలో ఉంది. అందువల్ల పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావడం లేదనే చెప్పుకోవాలి. అయితే ఈ తరహా స్కీములకు నరేంద్రమోడీ వ్యతిరేకం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రుణమాఫీ అమలు చేయాలంటే నాలుగు లక్షల కోట్లరూపాయల పైచిలుకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మనదేశ బడ్జెట్ 25 లక్షల కోట్లరూపాయల మేరకు ఉంది. అందులో జీతభత్యాలు, తప్పనిసరి ఖర్చుల పద్దులో 17 లక్షల కోట్ల రూపాయల వరకూ ప్రణాళికేతర పద్దులోనే పోతుంది. బడ్జెట్ లో అభివ్రుద్ధి వ్యయంగా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తంలో సగానికిపైగా వెచ్చిస్తే తప్ప రుణమాఫీ అమలు సాధ్యం కాదు. దీనివల్ల దీర్ఘకాలంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఇబ్బంది ఏర్పడుతుంది. మౌలిక వసతులకు నిధుల కొరత ఎదురవుతుంది. ఆ విషయాలను పక్కనపెట్టి కాంగ్రెసు సవాల్ విసురుతోంది. మోడీ తన విధానాలను పునస్సమీక్షించుకుని తాను సైతం రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి పునరుజ్జీవాన్నిచ్చాయి. బీజేపీకి పోటీనివ్వగల స్థాయికి కొంతమేరకు చేరుకుంది. రైతు రుణమాఫీ వంటి హామీలు గుప్పిస్తే ప్రజల్లో అధికశాతం ఉన్న రైతాంగం ఆకర్షితమయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల కమలం పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ రుణమాఫీని తామే ముందుగా ప్రకటించి అమల్లోకి తెచ్చేస్తే రాజకీయ ప్రయోజనం సమకూరుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండటాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. దీనిపైనే ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది బీజేపీ.కాంగ్రెసు పార్టీ బలం క్రమేపీ పెరుగుతోంది. నిన్నామొన్నటివరకూ పెద్దగా పట్టించుకోని చిన్నాచితక పార్టీలు కాంగ్రెసు గూటికి చేరుతున్నాయి. ఈనెల పదో తేదీన పెట్టిన సమావేశానికి 25 వరకూ పార్టీలు హాజరయ్యాయి. ఎన్నికల నాటికి మరో అయిదారు పార్టీలు జతకూడే అవకాశాలున్నాయి. మోడీ, అమిత్ షాల కంటే కాంగ్రెసు నాయకత్వం మిత్రులపట్ల కొంత సౌజన్యంతో వ్యవహరిస్తుందనే నమ్మకం ఏర్పడింది. బీజేపీకి ఉన్న రెండు పెద్ద మిత్రపక్షాలు శివసేన, అకాలీదళ్ గుర్రుగా ఉన్నాయి. అప్పుడప్పుడూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. పార్టీ పట్ల పెద్దగా వైముఖ్యం లేకపోయినప్పటికీ అగ్రనాయకత్వ విధానాలపైనే ఈరెండు పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. అదే సమయంలో తొలుత కాంగ్రెసు అధిష్టానం పట్ల కొంత వ్యతిరేకత ఉన్న పార్టీలు క్రమేపీ చేరువ అవుతున్నాయి. రాహుల్ మిత్రపక్షాలను చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. ప్రాధాన్యత నిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు కూటమి పెద్ద గా విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ పరాజయాన్ని టీడీపీ కాతాలో వేయకుండా కాంగ్రెసు అధిష్ఠానం చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రస్థాయి నాయకుడు ఏ ఒక్కరూ టీడీపీని విమర్శించలేదు. రాహుల్ ముందస్తుగా హెచ్చరించడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలన్నిటికీ చంద్రబాబును ఆహ్వానించారు. ఇవన్నీ మిత్రులకు పాజిటివ్ సిగ్నల్స్ పంపడానికి ఉద్దేశించినవే. నువ్వా? నేనా ? అంటూ ప్రధాని పీఠానికి సవాల్ విసురుతున్న రాహుల్ అన్నివిధాలుగా బీజేపీపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే యత్నాల్లో భాగంగానే మిత్రులను ఆకట్టుకునే విషయంలోనూ ముందంజ వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.