మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ, సంఘ్ పరివార్ వర్గాల్లో పార్టీ భవిష్యత్ గురించి అంతర్మథనం మొదలైంది. పలువురు నేతలు ఈ ఫలితాలపై పార్టీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలతో అంతర్గతంగా సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నరేంద్రమోదీ, అమిత్ షాల ప్రచారం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో స్థానిక నాయకత్వాలు బలంగా పనిచేసినందువల్ల పరాజయం పాలైనప్పటికీ గౌరవం దక్కించుకున్నామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఫలితాల తర్వాత పాత ఆడ్వాణీ వర్గం క్రియాశీలకంగా మారిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీకి 2009లో వచ్చినట్లు 116 సీట్లు మాత్రమే వస్తాయని ఒక వర్గం బలంగా భావిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో గతంలో వచ్చినట్ల్లు 62 సీట్లు రావనీ, సీట్ల సంఖ్య సగానికి తగ్గిపోవచ్చునని, ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ- ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి పాతిక సీట్లు రావడమూ కష్టమవుతుందని ఈ వర్గాలు అంటున్నాయి.2014లో బీజేపీకి ఒక్క యూపీ నుంచే 71సీట్లు వచ్చాయి. అప్పుడు బిహార్ లో 22 సీట్లు గెలుచుకున్న బీజేపీ- ఈ సారి ఆర్జేడీ-కాంగ్రె్‌స-లెఫ్ట్ కూటమి వల్ల బలంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. అలాగే గత ఎన్నికల్లో గుజరాత్‌లో 26కు 26 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి సగానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల అంచనా. ఇతర రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో ఇటీవల వచ్చిన ఫలితాల ప్రకారం- బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. అసోం, గోవా, హర్యానా, హిమాచల్, జమ్ముకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్. ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కమలనాథులు అత్యధిక సీట్లు గెల్చుకున్నప్పటికీ ఈసారి 25 నుంచి 30కి మించవని అంటున్నారు. ఒడిషాలో కొంత మెరుగుపడినప్పటికీ నాలుౖగెదు సీట్ల కంటే ఎక్కువ రాకపోవచ్చునని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో కూడా బీజేపీ సంఖ్యాబలం ఒకటి- రెండు సీట్లకంటే మించకపోవచ్చు. మొత్తం మీద- బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 180-200 సీట్లక్లు మించి రావని, అపుడు ఒడిషాతో కలుపుకుని దక్షిణాదిలోనే 75 సీట్లు ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటాయని పార్టీ వర్గాల అంచనా.వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా వీస్తుందని అన్ని పార్టీలు కలిసి దాదాపు 200 పైగా సీట్లు దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని బీజేపీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిపి ఒక ఫ్రంట్ గా ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ కనీసం 50 సీట్లు ఎక్కువ సంపాదిస్తే ప్రాంతీయ పార్టీలన్నీ తమకు మద్దతునిస్తాయని, కాని మెజారిటీ పక్షాలు మోదీ నేతృత్వాన్ని ఆమోదించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అపుడు ప్రధానమంత్రి ఎవరన్న విషయం చర్చనీయాంశం అవుతుందని బీజేపీ నేతలంటున్నారు. ఒకప్పుడు ఆడ్వాణీకి విధేయులుగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలు తలోదిక్కూ అయ్యారు. అరుణ్ ౖజెట్లీ, సుష్మా స్వరాజ్ అస్వస్థతకు గురయ్యారని, రాజ్‌నాథ్ సింగ్ కు కేవలం హిందీ బెల్డ్ లోనే ఆదరణ ఉన్నదని, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పదోన్నతి పొందగా, రవిశంకర్‌ప్రసాద్ వంటివారు శాఖాపరమైన పనులకు పరిమితమయ్యారనీ, ఉమాభారతి ఎన్నికల రాజకీయాలకు దూరమయ్యారనీ, అనంతకుమార్ మరణించారని వారు వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో పార్టీని దాదాపు గెలుపు అంచుల దాకా తీసుకొచ్చి హుందాగా తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర జలవనరుల మంత్రి, మహారాష్ట్ర నేత నితిన్ గడ్కరీల పేర్లు ముందుకు రావచ్చునని బిజెపి వర్గాలంటున్నాయి.