YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

24న ఢిల్లీకి కేసీఆర్, ప్రధానితో భేటీ

24న ఢిల్లీకి కేసీఆర్, ప్రధానితో భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ మరో నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో ఉండే అవకాశం ఉంది. 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 26 తేదీ సాయంత్రం వరకు వీలున్న సమయంలో అపాయింట్‌ మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయానికి విజ్ఞప్తి వెళ్ళింది. ఢిల్లీలోనే ఉన్న టిఆర్‌ఎస్ ఎంపిలు సైతం పార్లమెంటులో ప్రధానిని స్వయంగా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు.ప్రధాని కార్యాలయం నుంచి వచ్చే సమాధానానికి అనుగుణంగా కెసిఆర్ తన ఢిల్లీ పర్యటనను ఖరారు చేయనున్నారు. తెలంగాణకు రెండోసారి వరుసగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ఢిల్లీ వెళ్ళి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవాలనుకుంటున్నారు. ప్రతీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మర్యాదపూర్వకంగా భేటీ కావడాన్ని ఒక ఆనవాయితీగానే పాటిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ప్రధాని కార్యాలయం నుంచి సమాధానం వస్తుందని, ఆ తర్వాత కెసిఆర్ పర్యటనపై స్పష్టత వస్తుందని టిఆర్‌ఎస్ ఎంపి ఒకరు తెలిపారు. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ప్రధానితో కెసిఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిపోయిన తర్వాత కెసిఆర్ నేరుగా ఒడిషాకు వెళ్ళనున్నట్లు ఆ ఎంపి తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు లేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కెసిఆర్ గత కొంతకాలంలో ఆలోచిస్తున్నందున ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఈనెల 27వ తేదీన చర్చలు జరపనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తదితరులతో కలిసిన కెసిఆర్ ఇప్పుడు నవీన్ పట్నాయక్‌తో ఈ ప్రక్రియను తిరిగి మొదలుపెట్టనున్నారు. ఒడిషా పర్యటన సందర్భంగా పూరి జగన్నాధస్వామి ఆలయాన్ని కూడా కెసిఆర్ సందర్శించనున్నారు.

Related Posts