'మహానుభావుడు' చిత్రం తరువాత సంవత్సరం గ్యాప్ తీసుకుని ఒక ప్రేమ కథతో మన ముందుకి వచ్చాడు శర్వానంద్. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' చిత్రం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయకిగా నటించింది.. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది.
రివ్యూ:
సూర్య రావిపాటి (శర్వానంద్) ఫుట్‌బాల్ ప్లేయర్. అతనికి డాక్టర్ వైశాలి (సాయిపల్లవి) అంటే చాలా ఇష్టం. వైశాలి తండ్రి మేజిస్ట్రేట్. వీళ్లందరూ కోల్‌కతాలో ఉన్న తెలుగువాళ్లు. రెండేళ్ల తర్వాత వైశాలికి సూర్య అంటే ఇష్టం పెరుగుతుంది. ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఓ సందర్భంలో క్యాంప్ కోసం ఖాట్మండుకు వెళ్తుంది వైశాలి. ఆమె చూడకుండా ఉండలేకపోయిన సూర్య కూడా ఖాట్మండుకు వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన తండ్రిని కలుస్తాడు. తండ్రిని చూసిన సూర్యకు ప్రేమపెళ్లిళ్లు నిలవవనే విషయం గాఢంగా స్ఫురిస్తుంది. అదే విషయాన్ని వైశాలికి చెబుతాడు. ఆమె లివ్ ఇన్ రిలేషన్‌కు వ్యతిరేకం కాదు, కానీ పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడుతుంది. ఆ క్రమంలో వారిద్దరు కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏంటి? ప‌్రకృతి వల్ల వీరిద్దరు తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? పెళ్లి గొప్పదా? ప్రేమ గొప్పదా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
రెండేళ్లు ఒకమ్మాయి వెనుక తిరిగి, ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకుని, ఆమె మనసుకు దగ్గర కావడం మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రేమలో అరమరికలు ఉండవు. ప్రేమించిన వారి మధ్య అబద్ధాలుండవు అనే విషయాన్ని కూడా అంతర్లీనంగా చెప్పారు. కోల్‌కతా నేపథ్యం, కొన్ని లొకేషన్లు, కాన్ ఫ్లిక్ట్.. అంతా బాగానే ఉంది. కానీ ఏ సీనుకు ఆ సీను ప్రత్యేకంగా అనిపిస్తుందే తప్ప, కథలో ఎక్కడా కలిసినట్టు కనిపించదు. హీరోయిన్ తండ్రి అంతు చూడాలనుకున్న రౌడీ ముఠా ఎవరో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అయితే వాళ్లెవరో చివరికి కనిపించరు. సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో మేనరిజమ్ ఉన్నప్పటికీ ఎక్కడా అవన్నీ పెద్దగా కనెక్ట్ కావు. టైటిల్ సాంగ్ మినహా మిగిలినవి కథలో భాగంగా కదులుతుంటాయేగానీ, పెద్దగా కనెక్ట్ అయినట్టు కనిపించవు. ఒక వైపు వెన్నెలకిశోర్, సునీల్, ప్రియదర్శి.. ఇంత మంది కమెడియన్లున్నా, ఎక్కడా కామెడీ పండదు. సునీల్ పాత్ర కూడా స్పెషల్‌గా ఏమీ అనిపించదు. సాయిపల్లవికి డ్యాన్సులు తెలుసు అనే విషయాన్ని ఎలివేట్ చేయడానికే ఆమె ట్రాఫిక్‌లో బస్సు మీద నృత్యం చేసే షాట్, డాబా మీద నృత్యం చేసే షాట్ పెట్టారేమోనని అనిపిస్తుంది. ప్రేమించినవాడి మనసులో శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకున్న డాక్టర్ పడే తాపత్రయాన్ని చూపించాలనుకున్న దర్శకుడు భావోద్వేగాలను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది.
బలాలు:
- శర్వానంద్, సాయిపల్లవి నటన
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- అక్కడక్కడా లొకేషన్లు
- అక్కడక్కడా డైలాగులు
బలహీనతలు:
- సన్నివేశాల్లో కొత్తదనం లేదు
- ఎక్కువ సాగదీతగా అనిపించింది
- ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెద్దగా లేవు