హాయ్‌లాండ్‌ను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం (డిసెంబర్ 21న) అగ్రిగోల్డ్ కేసు విచారణ హైకోర్టులో మరోసారి జరిగింది. ఈ మేరకు హాయ్‌లాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా ఉమ్మడి హైకోర్టు ఖరారు చేసింది. హాయ్‌లాండ్‌ను వేలం వేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ని హైకోర్టు ఆదేశించింది. హాయ్‌లాండ్ విలువ ఎంత ఉంటుందనే దానిపై ఏపీ ప్రభుత్వాన్ని, సీఐడీ, ఎస్‌బీఐల నుంచి నివేదిక తీసుకుని విచారణ జరిపారు.హాయ్‌లాండ్‌లో కొంతభాగం ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టిన కారణంగా ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసే బాధ్యత బ్యాంకుకు అప్పగించింది. వేలం వేసిన తర్వాత అగ్రిగోల్డ్ ఖాతాదారులకు, బాధితులకు ఎంతివ్వాలి, ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి అన్నది ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది. హాయ్‌లాండ్ వేలం గురించి ప్రచారం చేసి, బిడ్డింగ్ వేసే వారి వివరాలను తమకు ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. జీఎస్‌ఎల్‌కు 3 కోట్ల జరిమానా
అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చి అనంతరం వెనక్కి తగ్గిన సంస్థ జీఎస్ఎల్. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్ ఉపసంహరణ ప్రతిపాదనకు హైకోర్టు అనుమతించింది. తమ సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, గతంలో 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినందున.. మిగిలిన రూ.7 కోట్లను జీఎస్ఎల్ సంస్థకు అందజేయనున్నారు.