వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన వారికి సుపరిచితమైన పేరిది. వైఎస్ కొడుకుగా, కడప ఎంపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్.. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడిగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. అభిమానులతో ‘జననేత’గా మన్ననలు అందుకుంటున్నారు. వైఎస్ మరణంతో గుండె పగిలి చనిపోయిన అభిమానుల కుటుంబాలను పలకరించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టినా.. ప్రజాసంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘకాలంగా పాదయాత్ర చేస్తున్నా.. జగన్ లక్ష్యం జనం మధ్యలో ఉండటమే. తండ్రికి తగ్గ తనయుడిగా, వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడిగా జగన్ ముందడుగేస్తున్నారు. జగన్ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది ఆయన మొండితనం గురించి. జగన్ జగమొండి. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో విబేధించి సొంత కుంపటి పెట్టుకున్నారాయన. సీబీఐ దాడులు, ఈడీ కేసులు, 16 నెలల జైలు జీవితం.. ఇవేవీ జగన్‌ను భయపెట్టలేదు. ఆయన స్థానంలో మరెవరైనా ఉంటే ఒత్తిళ్లకు తలొగ్గేవారే.. కానీ జగన్ మాత్రం మరింత మొండి పట్టుదలతో ముందుకెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఫేవరేట్‌గా బరిలో దిగింది. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబును ఒంటరిగానే ఓడించినంత పని చేశారాయన. పోల్ మేనేజ్‌మెంట్ వైఫల్యంతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఆయన పార్టీ ఓటమిపాలైంది. అక్రమాస్తుల మరకలు, అనుభవలేమి జగన్‌కు అధికారాన్ని దూరం చేశాయి. ఈసారి ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో 2019 ఎన్నికల కోసం జగన్ సమాయాత్తం అవుతున్నారు. అందుకే ప్రజాసంకల్ప యాత్ర పేరిట 2017 నవంబర్ నుంచే 13 జిల్లాల్లో పాదయాత్ర చేపట్టారు. ఇది ముగియగానే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. జగన్.. ఆరు నూరైనా అనుకున్నది సాధించుకోవాలనే రకం. ఇందుకోసం ఎంతటి శ్రమకైనా వెనుకాడరు. ఎవరి మాటా వినని సీతయ్య ఆయన. ఈ లక్షణమే చాలా మంది నేతలను ఆయనకు దూరం చేసింది. జగన్ అహంభావి, ఆయన ఎవరి మాట వినడు అనే విమర్శలు చాలా వచ్చాయి. పార్టీ మారే టైంలో చాలా మంది నేతలు జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాట కోసం తండ్రిలాగే ఎంతకైనా తెగిస్తాడనే పేరును నిలబెట్టుకోవడం కోసం జగన్ తాపత్రయపడతారు. ఈ లక్షణమే ఆయనకు జనంలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా గ్రామాల్లో, మాస్‌లో జగన్‌కు విపరీతమైన పట్టుంది. అందుకే నాయకులు దూరమైనా.. జనం మాత్రం తన వెంటే ఉన్నారని ఆయన బలంగా నమ్ముతారు.