శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఏటా శీతకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నివాసంలో కొద్ది రోజులు గడుపుతారు. ఈ దఫా డిసెంబరు 21 నుంచి 24 వరకు ఆయన ఇక్కడ ఉండనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని అక్కడే బస చేస్తారు.ఈ నెల 22న ఉదయం రాష్ట్రపతి కరీంనగర్‌కు వెళ్లి ప్రతిమ వైద్య కళాశాలలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 23వ తేదీన రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు రామ్‌నాథ్ కోవింద్ ఆతిథ్యమిస్తారు. 24న ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్తారు.