వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం పాదయాత్రలో చివరి జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని సమీకరిచి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఈ సభ ద్వారానే ఎన్నికల నగారా మోగించేందుకు జగన్ సిద్ధమయ్యారు.పాదయాత్ర విరామ సమయంలో ఇటీవల సీనియర్ నేతలతో చర్చలు జరిపిన జగన్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జగన్ పాదయాత్ర జనవరి మొదటి లేదా రెండో వారంలో పూర్తి కావస్తుంది. సంక్రాంతి పండగ ముందే పాదయాత్రకు ముగింపు పలకాలని నిర్ణయించారు. ఇచ్ఛాపురంలో జరిగే భారీ బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పనున్నారు. ప్రధానంగా రైతు రుణ మాఫీ, పెట్టుబడి పథకం, నిరుద్యోగ భృతి, వివిధ కులాలకు కార్పొరేషన్ల వంటి వాటిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.వైఎస్ జగన్ గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయనుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పైగానే ఆయనజనంలో ఉన్నారు. వివిధ వర్గాల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులు, మూతపడిన వివిధ కర్మాగారాల పరిస్థితిని స్యయంగా పరిశీలించారు. ఎక్కడికక్కడ వీటిపై స్థానిక ప్రజలకు అక్కడ జరిగే సభల్లో హామీలు ఇస్తూ వస్తున్నారు. అయితే వీటన్నింటినీ మ్యానిఫేస్టోలో ఉంచి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. ఇచ్ఛాపురం బహిరంగ సభల్లో స్పష్టమైన ప్రకటన చేస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.అధికార తెలుగుదేశం పార్టీ తమపై చేస్తున్న విమర్శలకు కూడా జగన్ ఈ సభ ద్వారానే చెక్ పెట్టనున్నారు. ప్రధానంగా బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందన్న వాదనను ఆయన తిప్పికొట్టనున్నారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 నియజకవర్గాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న విస్పష్టమైన ప్రకటన జగన్ చేయనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల వంటి వాటిని అమలు చేయడంలో విఫలమైన బీజేపీని కూడా జగన్ ఈ సభలో టార్గెట్ చేయనున్నారు. అలాగే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని, దానితో అంటకాగుతున్న చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా జగన్ ఫైర్ అవ్వనున్నారు. మొత్తం మీద పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా… అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు