YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దినదిన గండం.. జేడీఎస్ ఆయుష్షు

దినదిన గండం.. జేడీఎస్ ఆయుష్షు
 కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? లేకుంటే వాయిదా పడుతుందా? వాయిదా పడినా…విస్తరణ జరిగినా ముప్పు తప్పదా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి  బయటపడవచ్చనేది ఒక అంచనా. ఇప్పటికే కొందరు అసమ్మతి నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తమకు మంత్రివర్గంలో చోటు ఉంటుందో? లేదో? తేల్చుకునేందుకే వారు హస్తిన ప్రయాణమయ్యారు. అక్కడ వచ్చే క్లారిటీని బట్టి నిర్ణయం ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతిని క్యాష్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తొందరపడటం లేదు. ఆపరేషన్ కమల్ కు తెరతీయలేదు. దీనికి కారణం కూడా ఉంది. ఇప్పటికే కుమారస్వామి పాలన పట్ల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక నేతలు కుమారస్వామి తమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణ వరకూ వేచిచూద్దామని కొందరు నేతలు ఉన్నారు. తమకు స్థానం దక్కకుంటే ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కూడా వెనకాడే పరిస్థితి ఉండదన్నది కమలం పార్టీ అంచనా.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న సంఘటనలు చిన్నవేమీ కాదని యడ్యూరప్ప నమ్ముతున్నారు. తమంతట తామే వస్తే కాషాయ కండువా కప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పెద్ద సంఖ్యలో శాసనసభ్యుల అవసరం కూడా లేదు. కేవలం ఎనిమిది మంది వస్తే యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా తనకు సన్నిహితులైన బీజేపీ నేతలకు కాంగ్రెస్ అసమ్మతి నేతలను తమ గూటికి రప్పించే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. బీజేపీ నేత మహంతేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ నేతలు హాజరుకావడం కూడా కలకలం సృష్టిస్తోంది. ఈ విందు సమావేశానికి మంత్రి రమేష్ జార్ఖిహోళితో పాటు, ఎమ్మెల్యే నాగేంద్ర హాజరయ్యారు. జార్ఖిహో్ళి సోదరుల వెంట దాదాపు ఆరుగురు శాసనసభ్యులు ఉన్నారంటున్నారు. వీరు గత కొంతకాలంగా మంత్రి డీకే శివకుమార్ పై అసంతృప్తితో ఉన్నారు. తమ ప్రాంత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న శివకుమార్ పై అగ్రనేతలకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో వీరు పార్టీ మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే మాజీ ముఖ్యమత్రి సిద్ధరామయ్య ఎంత బుజ్జగిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ పరిస్థిితులను గమనించిన యడ్యూరప్ప గుంభనంగా ఉన్నారు

Related Posts