ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా.. ఏపీ ఓటర్లు ఆ పార్టీ షాక్ ఇచ్చారు. అదే సమయంలో అనుభవం ఉన్న చంద్రబాబుకే జై కొట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షానికి పరిమితమైన ఆ పార్టీ ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఏడాది కాలంగా ప్రజాసంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్రంలోని పరిస్థితులు.. వైసీపీ నేతల పనితీరుపై ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించిన జగన్.. దాని ఆధారంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడని కొద్దిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సర్వే రిపోర్టులను చూసుకుని గెలుపు గుర్రాల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేసిన జగన్.. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో భాగంగా గతంలో ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా పని చేసిన వారిని కాదని కొత్త వారికి ఛాన్స్‌లు ఇస్తున్నాడు. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది.తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరొందిన హిందూపురంలో ఇప్పటి వరకు సమన్వయకర్తగా పని చేసిన నవీన్ నిశ్చల్‌ను తీసేసి.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి అవకాశం ఇచ్చాడు ఆ పార్టీ అధినేత. దీంతో నవీన్ వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోవడంతో.. ఈ పరిస్థితిని గమనించిన పార్టీ అధిష్ఠానం కొన్ని చర్యలు తీసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు కొందరు నేతలను పంపించింది. ఇందులో భాగంగానే హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి.. వైసీపీలో ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న వారు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులు కాదని చెప్పి బాంబు పేల్చాడు. సమన్వయకర్తలు పార్టీని బలోపేతం చేసేందుకు నియమించినవారని క్లారిటీ ఇచ్చాడు. శ్రీకాంత్‌రెడ్డి మాటలతో ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమన్వయకర్తల్లో ఆందోళన మొదలైంది. రూ.లక్షలు వ్యయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని చర్చ మొదలైంది.