బెజవాడ రాజకీయాల్లో సంచలనం ఖాయం అయినట్టు తెలుస్తోంది. విజయవాడ రాజకీయాలతో మిళితమైన వంగవీటి కుటుంబం ప్రతినిధి వంగవీటి రాధా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దానికి ముహూర్తం కూడా ఖరారయినట్టు సమాచారం. ఇప్పటికే పలు పార్టీలు మారిన వంగవీటి రాధా ఈసారి మరో కొత్త పార్టీలోకి జంప్ చేయడానికి , జెండా మార్చడానికి సిద్ధపడినట్టు భావించవచ్చని సన్నిహితులే చెబుతున్నారు.వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆతర్వాత పీఆర్పీ నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. గడిచిని ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగానూ పరాజయం చవిచూశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా రంగంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఆయన వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. గడిచిన నాలుగున్న రేళ్లలో ఆయన పెట్టుకున్న ఆశలపై నీళ్లు జల్లుతూ తూర్పు నుంచి గానీ, బందరు ఎంపీ సీటులో గానీ పోటీ చేయాలంటూ వైసీపీ చెప్పడంతో రాధా అసంతృప్తికి గురయ్యరు. తన నిర్ణయం ప్రకటించేందుకు వేచి చూసినప్పటికీ ఫలితం దక్కడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్టు భావిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.జనసేన నుంచి ఆయనకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. సెంట్రల్ సీటులో ఆయనకు అవకాశం ఇచ్చేందుకు పవన్ వర్గం సుముఖంగా ఉండడంతో వంగవీటి రాధా జనసేనలో చేరడం ఖాయంగా మారింది. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా రాధా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. డిసెంబర్ 26 నాడు వంగవీటి రాధా నూతన ప్రస్థానం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా ఇది వైసీపీకి ఎదురుదెబ్బగా మారుతుందనే అబిప్రాయం పలువురి నుంచి వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతల్లో మాత్రం రాధా నిర్ణయం పట్ల ధీమా కనిపిస్తోంది. ఆయన పార్టీ మారే అవకాశాలు లేవని, వైసీపీలో కొనసాగుతారని అంచనాలేస్తున్నారు.