నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోన్న తిరుమల శ్రీవారి ఆలయంలో రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. శ్రీవేంకటేశ్వరుడు తన ఉభయ దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ఉత్సవం ప్రణయకలహోత్సవం డిసెంబరు 23న నిర్వహించనున్నారు. ఏటా వైకుంఠ ఏకాదశి ముగిసిన ఆరు రోజుల తర్వాత శ్రీవారి ప్రణయకలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రణయకలహోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గంటల అనంతరం మలయప్పస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు పల్లకీలపై వేర్వేరుగా ఊరేగిస్తారు. వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన శ్రీవారు, అమ్మవార్లు వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురుపడతారు. ఇక్కడే స్వామి, అమ్మవార్ల తరఫున పండితులు ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలతో స్తుతిస్తారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేస్తారు. అనంతరం ఒకరిపై ఒకరు పూలబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం లాంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా సాగుతుంది. ఈ సందర్భంగా ఆదివారం శ్రీవారి ఆలయంలో వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమినాడు శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తుంటారు. అయితే, మార్గశిర పౌర్ణమి ఈ సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పున్నమి గరుడసేవను రద్దు చేశారు.