ఇక నోట్ల రద్దు అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం’ అని మాజీ ఆర్థికమంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ‘జీడీపీ గణాంకాలు తప్పుదారి పట్టిస్తున్నాయి.. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తి తీవ్ర ఆందోళనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాసిన తాజా పుస్తకంలో కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ”ఇండియన్ అన్మడేహౌ ది మోడీ గవర్నమెంట్ బ్రోక్ దిఎకానమీ” పేరుతో రాసిన పుస్తకంలో యశ్వంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ఆర్థికవ్యవస్థను సరికొత్త శిఖరాలను చేర్చేందుకు ప్రధాని మోదీకి బంగారం లాంటి అవకాశం వచ్చింది. దీంతో భారత్‌ను పేద దేశం నుంచి మధ్యస్థాయి దేశంగా ఎదిగేలా చేయొచ్చు. అయితే ఆ అవకాశాలను మోదీ దుర్వినియోగం చేశారు’ అని యశ్వంత్ పేర్కొన్నారు.కొంతమంది చెబుతున్నట్లు తనకు మోదీతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని.. మంత్రిని చేయలేదనో, పదవి ఇవ్వలేదనో తాను ఈ వ్యాఖ్యలు చేయట్లేదని యశ్వంత్ అన్నారు. నిజం చెప్పాలంటే మోదీలో సామర్థ్యం ఉందని 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను గుర్తించానని చెప్పారు. అయితే ఆ సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించట్లేదని ఆరోపించారు.నోట్ల రద్దు, ఉద్యోగాలు, జీడీపీ గణాంకాలు, మేకిన్ ఇండియాపై కూడా యశ్వంత్ విమర్శలు చేశారు. ‘2016 నవంబరు 8న ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం చాలా విచిత్రమైనది. అది పాలనా వ్యవహారాలకు ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు. ఇక మేకిన్ ఇండియా.. అతిపెద్ద వైఫల్యం. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘నేషనల్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్’ వంటిదే మేకిన్ ఇండియా. రెండింటిలో పెద్ద తేడా ఏంలేదు’ అని ఆయన దుయ్యబట్టారు.ఇక ప్రధాని మోదీ చెప్పిన స్వయం ఉపాధి మార్గాలు.. నిరుద్యోగాన్ని ఏ మాత్రం తగ్గించలేవని యశ్వంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పకోడాలు అమ్ముకోవడం, ఆటోరిక్షా నడపడం, టీస్టాల్ పెట్టుకోవడం, న్యూస్ పేపర్లు వేయడం వంటివి చేయాలని ఏ యువత కోరుకోదని అన్నారు.భాజపాలో సీనియర్ నేత అయిన యశ్వంత్ సిన్హా.. గత రెండేళ్లుగా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన భాజపా నుంచి వైదొలిగారు.