మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ దంపతులు చెన్నైలోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు. చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోంలో శేషన్ తన భార్య జయలక్ష్మితో కలిసి ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో వారు బాధపడుతున్నారు. శేషన్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో, వారిని చూసేవారు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో చేరారని సమాచారం. కేరళలోని పాలక్కాడ్ లో శేషన్ కు సొంతిల్లు ఉంది.
గత ఏడాది డిసెంబర్ 15న శేషన్ తన 85వ పుట్టినరోజునుల్డ్ ఏజ్ హోమ్ లోనే జరుపుకున్నారు. అక్కడ తోటి వృద్ధులకు శేషన్ తన వంతు సాయం చేస్తున్నారు. ఆర్థిక సాయం, మెడికల్ బిల్స్ చెల్లించడం వంటివి చేస్తూ వారికి శేషన్ సాయపడుతున్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడు శేషన్. సత్యసాయిబాబా పరమపదించిన తర్వాత శేషన్ ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరారు.
అయితే, మూడేళ్లపాటు ఇక్కడే ఉన్న ఆయన, ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. ఇటీవలే తిరిగి ఇక్కడికి వచ్చారు. ఈసారి, తన భార్య జయలక్ష్మిని కూడా తనతో పాటు ఇక్కడికి తీసుకువచ్చారు. కాగా, నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన శేషన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికలలో డబ్బు, అధికార బలం ఉపయోగించకుండా ఉండేందుకు ఆయన బలమైన సంస్కరణలు తెచ్చారు. ప్రభుత్వ అధికారిగా ఆయన అందించిన సేవలకు గాను 1996లో అత్యున్నత రామన్ మెగ్ సెసే అవార్డును దక్కించుకున్నారు.