Highlights
- 29సార్లు దిల్లీకి వెళ్లినా అన్యాయమే చేశారు.
- మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎవరిపైనా నోరుజారొద్దు
- తెదేపా సమన్వయ సమావేశంలో చంద్రబాబు దిశానిర్థేశం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగేది రాష్ట్ర ప్రయోజనాల కోసమే కానీపదవుల కోసం కాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇస్తామంటేనే ఆనాడు ఒప్పుకున్నామని.., ఈ విషయంపై నేతలంతా స్పష్టతతో ఉండాలని దిశానిర్థేశం చేశారు. గురువారం ఆయన అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, మంత్రులతో సమావేశం నిర్వహించారు.పదవులకంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న ఆయన..., వాజ్ పేయి హయాంలో తొమ్మిది కేంద్ర మంత్రి పదవులు ఇస్తామన్నా వెంటపడలేదని ఆయన ఈ సందర్భగా గుర్తు చేశారు.
కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీకి కేటాయింపులు జరిపారు తప్ప.. ప్రత్యేకంగా చేసిందేమీ లేదని సీఎం స్పష్టం చేశారు. 29సార్లు దిల్లీ వెళ్లినా బడ్జెట్లో మనకు మళ్లీ అన్యాయం చేశారని చెప్పారు.రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామని..., అందుకు తగ్గ న్యాయం జరగాల్సిందేనన్నారు. నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామని ఈ సందర్భగా ఆయన గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం కొనసాగించాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు
ఇకపై రోజూ పార్టీకి కొంత సమయం కేటాయిస్తానని, త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గుర్తు చేసిన చంద్రబాబు... అనవసరంగా ఎప్పుడూ ఒకరిని నిందించబోమన్నారు. పార్లమెంట్ సమావేశంలో పార్టీ ఎంపీలు బాగా పనిచేసి ఏపీ సమస్యను దేశస్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. రానున్న రోజుల్లోనూ ఇదే పోరాటం కొనసాగించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.