మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతరత్న పురస్కారాన్ని ఉపసంహరించు కోవాలన్న అంశంపై మొదలైన వివాదం కొత్త మలుపు తీసుకుంది.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ సవరణ తీర్మానం అసలు ఆమోదం పొందనే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను నిలువరించడంలో విఫలమైనందున.. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ నిన్న ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.వాస్తవానికి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారని ఆమాద్మీ పార్టీ వెల్లడించింది. మరో ఎమ్మెల్యే సోమనాథ్ భారతి విజ్ఞప్తి మేరకు ఈ తీర్మానంలో రాజీవ్ గాంధీ భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలన్న సవరణను చేర్చినట్టు పేర్కొంది. నేను ప్రతిపాదించిన సవరణ అసలు ఓటింగ్ లోనే పెట్టలేదు. అలాంటప్పుడు ఈ తీర్మానం ఆమోదం పొందే ప్రశ్నేలేదు. ఈ వివరణతో ఇక వివాదానికి పుల్‌స్టాప్ పడుతుందని ఆశిస్తున్నానని సోమనాథ్ భారతి ట్విటర్లో పేర్కొన్నారు.కాగా ఈ సవరణ కారణంగా ఆమాద్మీ పార్టీలో తీవ్ర వివాదం చెలరేగింది. రాజీవ్‌గాంధీ భారత రత్న అవార్డును వెనక్కి తీసుకోవాలన్న సవరణను తాను వ్యతిరేకించడంతో... తన పదవికి రాజీనామా చేయాలని సీఎం కేజ్రీవాల్ చెప్పారని ఎమ్మెల్యే అల్కాలాంబా పేర్కొన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతివ్వాలని అడగడంతోనే తాను అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశానని ఆమె పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. నేను రాజీనామా చేసేందుకైనా సిద్ధమేకానీ.... ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వబోను. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలిచినందున నన్ను రాజీనామా చేయాలని అడిగారని ఆమె పేర్కొన్నారు. 43 ఏళ్ల అల్కాలాంబ గతంలో20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. 2014లో ఆమె ఆమాద్మీ పార్టీలో చేరారు.