రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తొలి జాబితా కింద జనవరిలో ప్రకటిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో జిల్లా నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిజాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. కాగా2014ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన నేపథ్యంలో ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకునేందుకు సర్వశక్తులతో టీడీపీ అధిష్ఠానం సిద్ధమవుతోంది. గెలుపే ధ్యేయంగా కొత్త శక్తులను కూడగట్టుకొంటోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతోపాటు అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఈ క్రమంలో తొలి జాబితాలో జిల్లాకు చెందిన అభ్యర్థుల పేర్లు తప్పక ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మొన్నటి వరకు తెలుగుదేశం అభ్యర్థులు ఎవరో అంతుపట్టని పరిస్థితి కొనసాగింది. సిట్టింగ్‌ల స్థానాల్లో సైతం టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న క్రమంలో పార్టీ కేడర్ గ్రూపులుగా చీలిపోయింది. అయితే, ఇటీవల అభ్యర్థుల విషయంలో కొంత స్పష్టత ఏర్పడటంతో పరిస్థితి సర్దుమణిగింది. అయినా అధిష్ఠానం ప్రకటిస్తే తప్ప కార్యకర్తల్లో,ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం లేదు. ఇది జరగడం ఆలస్యం అయ్యే కొద్ది పార్టీకి జరిగే నష్టం కూడా పెరుగుతూపోతోందని జిల్లా నాయకులు అధిష్ఠానానికి విన్నవించుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రకటన తొలుత ప్రకటించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది.ఈ వరుసలో సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక్కడి నుంచే పోటీ చేయడానికి మంత్రి సోమిరెడ్డి నిర్ణయించుకోవడం, అధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తొలి జాబితాల్లో సోమిరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి మరో మంత్రి పొంగూరు నారాయణ పోటీ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. నారాయణ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలని చంద్రబాబు భావించినా నెల్లూరు సీటీ నుంచి ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం దృష్ట్యా పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తొలి జాబితాలో మంత్రి నారాయణ పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.ఆత్మకూరులో తెలుగుదేశం సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. బొల్లినేని కృష్ణయ్య రంగ ప్రవేశంతోపాటు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టీడీపీలో చేరడానికి సుముఖంగా ఉండటం, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడును పార్టీలోకి ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు నాయకుల మధ్య సర్దుబాటు కుదిరితే తొలి జాబితాలోనే ఆత్మకూరు అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మకూరులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న అధినాయకత్వం అభ్యర్థి విషయంలోనూ త్వరగా క్లారిటీ ఇవ్వాలనే యోచిస్తుండటం గమనార్హం.సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు వారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణలకు కూడా అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో తొలి జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండొచ్చు అని పార్టీ వర్గాల అంచనా. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు మలి జాబితాలో ఉంటాయని, అయితే దానికి ఎక్కువ సమయం పట్టబోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటి వారానికి అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరో ఖచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.