ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రాష్ట్రాలతో పాటు దిల్లీ పర్యటన కోసం ఆదివారం బయల్దేరి వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ విశాఖకు బయలుదేరతారు. ఆ తర్వాత విశాఖ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళతారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అవుతారు. ఆదివారం రాత్రి అక్కడే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి దిల్లీ వెళ్తారు. 26న సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని కలుస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. 26న ప్రధానితో భేటీ అనంతరం అదే రోజు గానీ మరుసటి రోజు గానీ ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తారని తెలిసింది.