కేంద్రంలో ఇప్పటిదాకా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, తానెంతో బలవంతుడినని చెప్పే మోదీ దేశానికి ఏం చేశారని నిలదీశారు. మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కూడిన కూటమితో కలసి పని చేసేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న ‘ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2018’లో భాగంగా శనివారం ఆ మీడియా సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.