YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

సౌభాగ్యం అంటే ఏమిటి?

సౌభాగ్యం అంటే ఏమిటి?

సౌభాగ్యం అంటే చాలా మంది "భర్త ఉండి మంగళసూత్రం ధరించే యోగ్యత ఉండడమని " అనుకుంటారు.దాన్ని సుమంగళత్వం అంటారు.

సౌభాగ్యం అంటే "భర్త తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం".అందుకే 14 సం.అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం అనే రెండు వరాలు కావాలని పట్టుపట్టిన కైకేయిని చూసి దశరథుడు " ఈ రోజు వరకు నువ్వు గొప్ప సౌభాగ్యవతివి.కాని నేటి నుండి నువ్వు సౌభాగ్యాన్ని కోల్పోయావు పో!"
అని నిందిస్తాడు.

అలాగే హరివంశంలో...
నారదుడు స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీదేవి అంత:పురంలో కృష్ణుడు ఉన్న సమయంలో ఆ పుష్పం యొక్క గొప్పదనాన్ని వివరించి బహూకరిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన ప్రక్కనే ఉన్న రుక్మిణికి ఇస్తాడు.
అది చూసి నారదుడు ఇలా అంటాడు.
"కృష్ణా! నీ భార్యలందరిలో ఎవరు గొప్ప సౌభాగ్యవతి? అని నేను ఆలోచించే వాడిని. సత్యభామ కావచ్చేమోనని భావించే వాడిని కాని నేటితో అందరిలోకి రుక్మిణీదేవి గొప్ప సౌభాగ్యవతి అని బుుజువైంది." అంటాడు.

ఈ విషయం తెలిసిన సత్యభామ అలుగుతుంది..నిజానికి ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చినందుకు మాత్సర్యంతో అలగలేదు సత్యభామ . అంత చిన్న వ్యక్తిత్వం కాదు ఆమెది. భర్త మనసులో తన స్థానం తగ్గిందని అలుగుతుంది.
అప్పుడు కృష్ణుడు సాధారణ మనుషుల మాదిరిగా "నీకు స్వార్థం ఎక్కువ . ఉదార స్వభావం లేదు." అంటూ కోపగించలేదు.ఎందుకంటే కృష్ణుడు పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాడు.ఎవరిని ఎలా తృప్తి పరచాలో అతనికి తెలుసు. అదీగాక సత్యభామ అలకలో ధర్మం ఉంది.భర్త మనసులో తనపట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంది. అందుకే వెళ్లి సత్యభామను ఓదార్చుతాడు. అప్పుడు సత్యభామ ఇలా అంటుంది.

"ప్రాణేశ్వరా! మనం ఏకాంతంగా ఉన్నప్పుడు అనేక సార్లు నేను అడగకున్నా ' భామా ! అందరిలోకి నువ్వే గొప్ప సౌభాగ్యవతివి, అని చెప్పేవారు. నేటితో మీ మాటలు అబద్దాలని తేలిపోయింది. నేను సౌభాగ్య హీనురాలనని అందరి ముందు బుుజువైంది.. " అని దు:ఖిస్తుంది.
అప్పుడు కృష్ణుడు.......

"భామా ! నేను నిజం చెబుతున్నాను. నా శరీరం ఈ లోకంలో ఎంత వరకు నిలిచి ఉంటుందో అంతవరకు నీ పట్ల నాకున్న మోహం తీరనిది .అంతగా నీ ప్రేమతో నన్నుగెలుచుకున్నావు..
నీ కోసం పారిజాత వృక్షాన్నే తీసుకువచ్చి నీతో "పుణ్యక వ్రతాన్ని " చేయిస్తాను. "అని మాట ఇస్తాడు కృష్ణుడు.
అప్పుడు సత్యభామ నా సౌభాగ్యత్వం అందరి ముందు బుుజువౌతుంది అంటూ సంతోషిస్తుంది.

కాబట్టి "సౌభాగ్యం అంటే భర్త మనసులో తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం.". అందుకోసం ప్రతి స్త్రీ నిరంతరం పరితపించాలి.. అలా సౌభాగ్యవతి గా ఉండేలా తన మనసును వ్యక్తిత్వాన్ని.. శరీరాన్ని.. బుద్ధిని .. చివరకు ఆత్మను సంసిద్ధపరుచుకోవాలి. అలాంటి స్త్రీల నే సనాతన ధర్మం "పతివ్రతలని "పిలిచింది.
వీరు నడయాడు తీర్థాలు, కనబడు దేవతలు

ధన్యా పతివ్రతా నారీ నాన్యా పూజ్యా విశేషత:
పావనీ సర్వలోకానాం సర్వపాపౌఘ నాశినీ

పతివ్రత అయిన స్త్రీ ధన్యురాలు. ఆమె విశేషంగా పూజనీయురాలు. ఆమే తన చుట్టూ ఉన్న వారిని పవిత్రపరిచే శక్తిని కలిగి ఉండి అన్ని పాపాలను నశింపజేస్తుంది.

సా ధన్యా జననీ లోకే సధన్యో జనక : పితా
ధన్య: సచపతిర్యస్య గృహే దేవీ పతివ్రతా

అలా పతివ్రత గా జీవించేలా తర్పీదు నిచ్చిన తల్లి ధన్యురాలు. తండ్రి ధన్యుడు. అలాంటి స్త్రీని భార్యగా పొందిన భర్త ధన్యుడు. అలాంటి స్త్రీ
ఆ ఇంటి దేవత.

పితృవంశ్యా మాతృవంశ్యా:పతి వంశ్యాస్త్రయస్త్రయ :I
పతివ్రతాయా : పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే

ఆ పతివ్రత వల్ల ఆమె తల్లి వంశం - తండ్రి వంశం - భర్త వంశం ఈ మూడు వంశాలు పావనమౌతాయి

Related Posts