YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిక్కే కిక్కు

కిక్కే  కిక్కు
ఒక పక్క జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఉండి కుటుంబ పోషణే కష్టంగా మారి ప్రజలు కరువు కోరల్లో చిక్కుకున్నారు.  మరో పక్క మద్యానికి మాత్రం డబ్బులు అప్పో సొప్పో తెచ్చి వేలకు వేలు తగలేస్తున్నారు. మార్కాపురం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో మార్కాపురం, కందుకూరు, సింగరాయకొండ, పొదిలి, దర్శి, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 177 మద్యం షాపులు, 10 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. లైసెన్స్‌ ఫీజు కింద ప్రభుత్వానికి రూ.18.50 కోట్లు, రిజిస్ట్రేషన్‌ చార్జీల కింద రూ.8.85 కోట్లు కలిసి రూ.27.35 కోట్ల ఆదాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గతేడాది డిసెంబర్‌ 10 నాటికి 9 పోలీసుస్టేషన్ల పరిధిలో 307 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 365 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. 18.8 శాతం ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు మద్యం గోడౌన్‌ రికార్డులు ద్వారా తెలుస్తోంది. గతేడాది నుంచి ఈ ఏడాది దర్శిలో 30 శాతం అమ్మకాలు పెరగ్గా, ఆ తర్వాత యర్రగొండపాలెంలో 26 శాతం అమ్మకాలు పెరిగాయి. అంటే దర్శిలో గతేడాది 30 కోట్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 40 కోట్లు, యర్రగొండపాలెంలో 22 నుంచి 28 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. కుటుంబపోషణ భారమవుతున్నా మద్యం ప్రియులు మాత్రం అప్పు చేసేనా మద్యం షాపులకు వెళ్లి మద్యాన్ని తాగుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం భారీగా రావచ్చని అంచనా వేస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో బెల్ట్‌షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తున్నా మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్దదోర్నాల, కనిగిరి, దర్శి, కందుకూరు, తదితర ప్రాంతాల్లో బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 10 వరకు బెల్ట్‌షాపుల నిర్వాహకులపై 345 కేసులు నమోదు చేసి 312 మందిని అరెస్టు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో 38,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా విక్రయిస్తున్న వారిపై 66 కేసులు నమోదు చేసి 38 మందిని అరెస్టు చేశారు. నాటుసారా, బెల్ట్‌షాపులకు మద్యాన్ని తీసుకెళ్తున్న 17 వాహనాలను సీజ్‌ చేశారు. 3,900 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనిగిరిలో 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్ముతున్నందుకు షాపును సీజ్‌ చేశారు.

Related Posts