దేశంలో అతి పొడవైన రోడ్- రైల్ బ్రిడ్జిగా పేరొందిన రాజమండ్రి వంతెన మరికొద్ది రోజుల్లో రెండో స్థానంలో నిలవనుంది. బ్రహ్మపుత్ర నదిపై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య నిర్మించిన బోగీబీల్ వంతెన ఆ స్థానాన్ని ఆక్రమించనుంది. సుమారు 21 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ వంతెన ఎట్టకేలకు సిద్ధమైంది. డిసెంబరు 25న మాజీ ప్రధాని అల్ బిహారీ వాజ్‌పేయీ పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆసియాలో 3వ స్థానం, ఇండియాలో మొదటి స్థానంలో ఉన్న అతి పొడవైన రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వంతెన పొడవు 4.1 కిమీలు కాగా.. బోగీబీల్ వంతెన పొడవు 4.94 కిమీలు. 1997లో అప్పటి ప్రధాని హెచ్.డి. దేవేగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులకు శిలాఫలకం వేశారు. పనులు నత్తనడకన సాగడంతో నిర్మాణం పూర్తికావడానికి 21 ఏళ్లు పట్టింది. రూ.5,920 కోట్లతో ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన వల్ల అస్సాంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్ పట్టణాల మధ్య దూరం 500 కిమీల నుంచి 100 కిమీలకు తగ్గనుంది. 10 గంటల ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గిపోనుంది. ఈ వంతెన వల్ల ఈశాన్య సరిహద్దులోని భద్రతా దళానికి రక్షణ సామాగ్రి, మౌలిక సదుపాయాలను కల్పించడం సులభం అవుతుంది. పర్వత ప్రాంతాల్లోని భారీ వరదలను, భారీ బరువులను సైతం తట్టుకునేలా ఈ వంతెన నిర్మించారు