అనంతపురంలో పార్టీ పరిస్థితి దిగజారిందా? అక్కడ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నారా? వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతోందా? అంటే.. ఔననే సందేహాలే వస్తున్నాయి. అనంతపురం టీడీపీకి అసలు సిసలైన కంచుకోట. నిజానికి పార్టీ అధినేత, సీఎం చంద్ర బాబు సొంత జిల్లా చిత్తూరు కన్నాఎక్కువగా అనంతపురం ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారు. ఇక్కడ గత 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఉరవకొండ, కదిరి నియోజకవర్గాలు తప్పితే.. మిగిలిన అన్ని చోట్లా కూడా టీడీపీ సైకిల్ పరుగులు పెట్టింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మరింత బలోపేతమై.. ఆరెండు చోట్లా కూడా పార్టీని గెలిపించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ గత ఎన్నికల్లో ఓడిన రెండు సీట్లలో కూడా కదిరిని 600 ఓట్లు, ఉరవకొండను 2200 ఓట్లతో మాత్రమే కోల్పోయింది.చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ క్లీన్‌స్వీప్ చేయాలని ప్లాన్లు వేస్తుంటే అనంతపురంలోని టీడీపీ నాయకులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు., సీనియర్ల నుంచి జూని యర్ల వరకు కూడా టీడీపీ అభివృద్ది కన్నా.. తాము లేకపోతే.. పార్టీ లేదనే కోణంలో ఆలోచిస్తూ.. చిత్తానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి అనంతపురంలో టీడీపీని బలోపేతం చేసుకునేందుకు చం ద్రబాబు అనేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా కరువుతో అల్లాడుతున్న ఈ జిల్లాకు నీరు ఇచ్చే ఏర్పాటు చేశారు. హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తరలించడం టీడీపీకి ఐదారు నియోజకవర్గాల్లో పెద్ద ప్లస్ పాయింట్. అదే విధంగా వలసలను అధిగమించేందుకు అనేక ప్రణాళికలు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈజిల్లాను ప్రత్యేకంగా భావించడంలో చంద్రబాబు కృషి చాలానే కనిపిస్తోంది., అయితే, ఇక్కడి నాయకులు మాత్రం తమ ఇష్టానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.సాధారణంగా చంద్రబాబు లోటు లేకుండా ఈ జిల్లాను అన్ని విధాలా కాపు కాస్తున్నారు. అయితే, రుణమాఫీ విషయం లో మిగిలిన జిల్లాలతోపాటు ఇది కూడా కొంచెం వెనుకబడింది. అయితే, దీనిని అధిగమించేందుకు నాయకులు ఇక్కడ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. పైగా నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడంతో నే ఇక్కడి రాజకీయాలకు కాలం సరిపోవడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉన్ననాయ కులే.. టీడీపీకి ఈ దఫా ఆశించిన ఫలితాలు రావడం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. పన్నెండు మంది సిట్టింగుల్లో ఐదు మంది తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే విషయం బాహాటంగానే వినిపిస్తోంది.ఆ ఎమ్మెల్యేల తీరు వల్ల, అక్కడ నెలకొన్న వర్గ విబేధాల వల్ల వాళ్లకు ఓటమి తప్పదని విశ్లేషిస్తున్నారు. ఈ ఐదు మందినీ మార్చాల్సిన అవసరం కూడా ఉంది. అయితే, ఇది సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నార్థకమే. అభ్యర్థులను మార్చినంత మాత్రాన టీడీపీ ఇమేజ్ మారిపోతుందా అనేది కూడా గమనించాల్సిన విషయమే! ఖాయంగా పోయే ఐదు సీట్లలో శింగనమల, పుట్టపర్తి, గుంతకల్, అనంతపురం అర్బన్, కల్యాణదుర్గం సీట్లు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ఫిరాయింపు రాజకీయాలు టీడీపీని దెబ్బతీసే అవకాశాలున్నాయి. అయినా టీడీపీ లెక్కల్లోనే ఐదుపోతాయని తేలిదంటే.. వాస్తవం ఇంకా కఠినంగా ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు.ఇక జిల్లాలో పార్టీ సీనియర్లుగా ఉన్న మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, హన్మంతరాయ చౌదరి, పార్థసారథి, మాజీ మంత్రి, విప్ పల్లె రఘునాథరెడ్డి మధ్య సమన్వయం లేదు. వీళ్లలో వీళ్లే వెన్నుపోటు రాజకీయాలకు తెరదీస్తున్నారు. మరి ఈ పరిణామాన్ని, స్థానిక నేతల వివాదాలను పరిష్కరిస్తేనే తప్ప ఇక్కడ టీడీపీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.