గజ, తిత్లీ, పెథామ్ మూడు తుపాన్లు, అకాల భారీ వర్షాలు లక్షలాది ఎకరాలను ముంచెత్తిన విషాదం కొన్ని ప్రాంతాల్లో ఉండగానే ఇంకా రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. పెథాయ్ తుపాను తూర్పుగోదావరి జిల్లా వద్ద తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావం వలన విజయనగరం జిల్లాలో అత్యధిక వర్షాలు పడ్డాయి. రాయలసీమలో చినుకు పడలేదు.ఈ సంవత్సరం వచ్చిన మూడు తుపాన్లు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కలిగించలేదు.నైరుతి సీజన్ నుంచి ఆరు జిల్లాల్లో నెలకొన్న దుర్భిక్షం ఈశాన్యం (రబీ)లోనూ కొనసాగుతోంది. పెథారుకి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్యం సీజన్‌లో కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 88 శాతం తక్కువ నమోదుకాగా పెథారు అనంతరం అది 69 శాతానికి తగ్గింది. ఇంకా అత్యల్ప వర్షపాతం (లోటు 60-99 శాతం) నెలకొంది. ఈశాన్య రుతుపవన కాలం మరో పది రోజుల్లో ముగుస్తుండగా ఎపి మొత్తమ్మీద ఇప్పటికీ లోటు వర్షపాతం నమోదైంది. ఇలాంటి విభిన్న పరి స్థితులు ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసు కోవడం పట్ల అటు శాస్త్రవేత్తలను, ఇటు సంబంధిత ప్రభుత్వ విభాగా లను విస్మయ పరుస్తోంది. పెథాయ్ ప్రభావం వలన ఈ నెల 16-18 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సగటున 35 మిల్లీమీటర్ల వర్షం పడింది. తపాను తీరం దాటిన తూర్పుగోదావరిలో సగటున 78.7 మిమీ కురవగా ఇదే సమయంలో విజయనగరంలో అత్యధికంగా 81.8 మిమీ వర్షం నమోదైంది. కృష్ణా, విశాఖపట్నంలోనూ తూర్పుగోదావరి కంటే ఎక్కువ వర్షం కురిసింది. పెథారు వలన శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరులో ఒక మోస్తరు వానలు పడ్డాయి. ఈశాన్యం అక్టోబర్‌లో మొదలుకాగా తిత్లీ, పెథారు రెండు తుపాన్లు ఉత్తరకోస్తా జిల్లాల్లోనే తీరం దాటాయి. నైరుతి చివరిలో వచ్చిన గజ తుపాను మాత్రం తమిళనాడులో తీరం దాటడంతో మన రాష్ట్రంపై అస్సలు ప్రభావం లేదు. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తరకోస్తాలో పెథారు వలన 71.1 మిమీ వర్షం పడగా దక్షిణ కోస్తాలో 34.6 మిమీ నమోదైంది. రాయలసీమలో ఒక్క చినుకు కూడా పడలేదు. జూన్ 1 నుంచి ఇప్పటి ఇప్పటి వరకు రాష్ట్రమొత్తమ్మీద 31 శాతం లోటు వర్షం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణాలో సాధారణ స్థాయి, తతిమ్మా ఏడు జిల్లాల్లో తక్కువ వర్షం కురిసింది. కాగా విజయనగరం, కృష్ణా, విశాఖ తక్కువ వర్షం (20-59 శాతం లోటు) కేటగిరీకి అతి చేరువలో ఉన్నాయి. కడప, ప్రకాశం అత్యల్ప వర్షం కేటగిరీకి అత్యంత సమీపంలో ఉన్నాయి.పెథాయ్ బీభత్సానికి తూర్పుగోదావరిలో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా ఇదే జిల్లాల్లో ఇప్పటికీ 29 మండలాల్లో వర్షాభావం నెలకొంది. తుపాను వలన కేవలం ఐదు మండలాల్లోనే సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. అమలాపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, విఆర్ పురం, కూనవరం లో మామూలు కంటే అధిక వర్షం నమోదైంది. అలాగే తిత్లీ తుపాను శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేయగా ప్రస్తుతం ఆ జిల్లాలో ఆముదాలవలన, ఎచ్చెర్ల మండలాల్లో ఇంకా వర్షాభావం నెలకొంది. తుపాన్లు, భారీ వర్షాల బారిన పడ్డప్పటికీ ఇంకా విజయనగరంలో 17, విశాఖ 21, పశ్చిమ గోదావరి 8, కృష్ణాలో 22 వర్షాభావ మండలాలున్నాయి