YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో 16 ఫుడ్ పార్క్స్

ఏపీలో 16 ఫుడ్ పార్క్స్
వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు విందు భోజనం వడ్డించింది. ఫుడ్‌పార్కులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల పేరుతో 2,000కు పైగా ఎకరాలను అప్పనంగా దోచిపెట్టింది. చిత్తూరు నుంచి విజయనగరం జిల్లా వరకు మొత్తం 16 ఫుడ్‌పార్కులు ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి 2015–20 పేరుతో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫుడ్‌ పార్కుల మూలధన వ్యయంలో 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. అంటే రూ.100 కోట్లు పెట్టి యూనిట్‌ ఏర్పాటు చేస్తే అందులో రూ.50 కోట్లు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. చిన్న యూనిట్లు అయితే 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు తీసుకునే రుణాలపై 7 శాతం వడ్డీ రాయితీ కూడా అందుతుంది. ఇవి కాకుండా అనేక రాయితీలను ఈ పాలసీ అందిస్తోంది. 16 ఫుడ్‌పార్కులకు 1,565.42 ఎకరాలు కేటాయించగా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు మరో 600కు పైగా ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. 40 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఫుడ్‌పార్కులకు రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టారు. ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. దాదాపు రూ.4,000 కోట్ల విలువైన భూములను ఫుడ్‌పార్కుల పేరుతో కేవలం రూ.126 కోట్లకే కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ముఖ్యనేతలు భారీఎత్తున లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పత్తిపాటి ఫుడ్‌పార్కు డైరెక్టర్లు అధికార  పార్టీలో రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు.  ఫుడ్‌పార్కుల్లో డైరెక్టర్లుగా ఉన్న వారంతా అధికార పక్షానికి అత్యంత సన్నిహితులని సాక్షాత్తూ అధికార వర్గాలే చెబుతున్నాయి.విజయనగరం జిల్లాలో మొత్తం 4 ఫుడ్‌ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అందులో యోగా గురు రాందేవ్‌ బాబాకి చెందిన పతంజలి గ్రూపు 172.84 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కును ఏర్పాటు చేస్తోంది. రెండు పార్కులు ఒకరివేనని, వేర్వేరు పార్కుల పేర్లతో భూములు తీసుకున్నారని స్పష్టమవుతోంది.పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాయితీలు ఇవ్వడంలో తప్పులేదు కానీ ఈ ప్రయోజనాలు అందరికీ కాకుండా కేవలం ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే లభిస్తున్నాయంటూ ఇతర పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 2 నుంచి 10 ఎకరాల దాకా భూములను దక్కించుకున్నాయి. ఇలా తీసుకున్న వాటిలో హెరిటేజ్‌తోపాటు సీసీఎల్‌ ప్రోడక్ట్స్, నేచురల్‌ బెస్ట్‌ ఫుడ్స్, జీవో4 మాక్స్‌ ఫుడ్స్, అమరావతి గ్రెయిన్‌ మిల్స్, అమరావతి స్పైసెస్‌ తదితర సంస్థలున్నాయి. ఇవన్నీ అధికార పార్టీకి దగ్గర సంబంధాలున్న కంపెనీలే. కృష్ణా జిల్లాలో రూ.కోట్ల విలువైన భూముల్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ పేరుతో కేటాయించారు. కర్నూలు జిల్లాలో ఏకంగా 623 ఎకరాలను ఒక్క జైన్‌ ఇరిగేషన్‌ సంస్థకే కేటాయించారు. 

Related Posts