Highlights
- పేరుకే స్వచ్ఛ భారత్.. విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్
- ఇదేమీ అంత పెద్ద విషయం కాదు...సరాఫ్
రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాళీచరణ్ సరాఫ్ చేసిన పనికి బీజేపీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి కాళిచరణ్ తన కారును రోడ్డు పక్కన ఆపి అక్కడే ఉన్న గోడకు మూత్రవిసర్జన చేస్తున్న అంశం ఇప్పుడు జైపూర్‌లో కలకలం రేపుతోంది. ‘బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతోంది. కానీ, ఆ పార్టీ మంత్రి కాళిచరణ్ మాత్రం రాజస్థాన్‌లో పబ్లిక్‌లో యూరిన్ పోస్తూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రి చేసిన పని ప్రభుత్వానికే సిగ్గుచేటు చర్యని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ నేత రఘు శర్మ డిమాండ్ చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ విభాగ ఉపాధ్యక్షుడు అర్చనా శర్మ కూడా మంత్రి తీరుపై మండిపడ్డారు. మంత్రి కాళిచరణ్ ఇలాంటి చర్యకు పాల్పడటం తొలిసారి కాదని గతంలోనూ ఇలాంటి చర్యకే పాల్పడ్డారని శర్మ విమర్శించారు. ఈ సంఘటనపై స్పందించిన సరాఫ్, ఇదేమీ అంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.